Tirupati News: కూటమికి ఓటేసి భూమన కాళ్లపై పడ్డ ముగ్గురు కార్పొరేటర్లు - బెదిరించారని గగ్గోలు
Bhumana: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విచిత్రాలు చోటు చేసుకుటున్నాయి. ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు కూటమి అభ్యర్తికి ఓటేశారు. కానీ భూమనకు క్షమాపణలు చెప్పారు.

Tirupati Corporation Deputy Mayor election: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ ఉన్న టీడీపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు కాకుండా.. ఇరవై నాలుగు మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతు పలికారు. అదే సమయంలో.. వైసీపీకి సపోర్టుగా ఉన్న కొంత మంది ఓటింగ్ కు హాజరు కాలేదు. ఎక్స్ అఫిషియో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఓటింగ్ కు అనారోగ్య కారణాలతో గైర్హాజర్ అయ్యారు. దీంతో వైసీపీకి ఇరవై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి.
కార్పొరేటర్లు అందరూ భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమన అందర్నీ నిలబెట్టుకుని గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు వారిలో అత్యధిక మంది టీడీపీ గూటికి చేరడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఎన్నిక ముగిసిన తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని కలిశారు. తాము డబ్బులు తీసుకోలేదని.. తమను బెదిరించడంతో కూటమి సభ్యులకు ఓటు వేయాల్సి వచ్చిందని వారు రోదిస్తూ భూమన కరుణాకర్ రెడ్డికి చెప్పారు. భూమన కాళ్లపై పడ్డారు. అయితే భూమన వారిని ఓదార్చారు. జరిగిందేదో జరగిపోయిందని సర్ది చెప్పారు.
👉 తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ట్విస్ట్..
— ANN Telugu (@AmmanewsL) February 4, 2025
👉భూమన ఇంట్లో ప్రత్యక్షమైన YCP కార్పొరేటర్లు..
👉తాము ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదని వెల్లడి..#YSJagan #Pushpa2TheRule📷 #Tirupatimuncipalcorporation pic.twitter.com/MZWr90UINL
తిరుపతిలో రెండో డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ రెడ్డి ఉండేవారు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు. గత ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాల నుంచి విరామం తీసుకుని తన టిక్కెట్ ను కుమారుడికి ఇప్పించుకున్నారు. తనకు టీటీడీ చైర్మన్ పోస్టు తీసుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ పదవికి.. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఆయన ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన రెండో డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎన్నికలు జరిగాయి. తాము రాజీనామా చేసిన స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే రాజకీయంగా సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ముందుగానే అందర్నీ క్యాంపులకు తరలించారు.
డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసిన అభ్యర్థి చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయనను బెదిరించారని .. చివరి నిమిషంలో లడ్డూ భాస్కర్ అనే కార్పొరేటర్ ను అభ్యర్థిగా నిలిపారు. అప్పటికే తమ క్యాంపులో కావాల్సినంత మంది కార్పొరేటర్లు ఉండటంతో డిప్యూటీ మేయర్ పీఠాన్ని గెల్చుకుంటామనుకున్నారు. కానీ బస్సు దిగిన వెంటనే నలుగురు కార్పొరేటర్లు టీడీపీ నేతలతో వెళ్లిపోయారు. కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తే.. తమను కిడ్నాప్ చేయలేదని తమకు వైసీపీకి ఓటేయడం ఇష్టం లేకనే వెళ్లిపోయామన్నారు. ఈ గొడవల మధ్య ముగ్గురు కార్పొరేటర్లు కూడా కూటమికి ఓటేసి గెలిపించారు ఆ తర్వాత భూమనను కలిసి తాము డబ్బులు తీసుకోలేదని.. కాళ్లపై పడటం సంచలనంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

