Rapido Bike Taxi: ర్యాపిడోకి షాక్ ఇచ్చిన కోర్టు, సర్వీస్‌లు నిలిపివేయాలంటూ ఆదేశాలు
Rapido Bike Taxi: ర్యాపిడో సర్వీస్‌లను ఆపేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది.
Rapido Bike Taxi Services:
పుణెలో బంద్
ర్యాపిడోకి బాంబే హైకోర్ట్ షాక్ ఇచ్చింది. పుణెలో ఇప్పటికిప్పుడు అన్ని సర్వీస్‌లనూ బంద్ చేయాలని ఆదేశించింది. బైక్‌లతో పాటు కంపెనీకి చెందిన వాహనాలకు లైసెన్స్ లేదని తేల్చి చెప్పింది. ర్యాపిడో ట్యాక్సీ సర్వీస్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు...ఈ ఆదేశాలిచ్చింది. ఈ రోజు (జనవరి 13) మధ్యాహ్నం నుంచే అన్ని సర్వీస్‌లు నిలిపివేయాలని వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని కంపెనీ వెల్లడించింది. జనవరి 20వ తేదీ వరకూ అన్ని సర్వీస్‌లను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. వచ్చే శుక్రవారం మరోసారి దీనిపై విచారణ చేపట్టనుంది బాంబే న్యాయస్థానం.
అసలేం జరిగింది..?
పుణె RTO లైసెన్స్ కోసం గతేడాది మార్చి 16న అప్లై చేసుకుంది ర్యాపిడో కంపెనీ. అయితే...రవాణా శాఖ అందుకు లైసెన్స్ జారీ చేయలేదు. అంతే కాదు. ర్యాపిడీ సర్వీస్‌లను వినియోగించుకోవద్దని ప్రజలకు సూచించింది కూడా. యాప్ కూడా వాడొద్దని వెల్లడించింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ర్యాపిడో...బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. గతేడాది నవంబర్ 29వ తేదీన మరోసారి కంపెనీ అప్లికేషన్‌ని పరిగణించాలని కోర్టు రవాణా శాఖకు సూచించింది. అయినా డిసెంబర్‌లో మరోసారి రిజెక్ట్ చేసింది రవాణా శాఖ. బైక్ ట్యాక్సీలపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవని అందుకే...ఆ దరఖాస్తుని పరిగణనలోకి తీసుకోవడం లేదని రవాణా శాఖ తేల్చి చెప్పింది. ఆ తరవాతే కోర్టులో పిటిషన్ వేసింది ర్యాపిడో. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పలు సూచనలు చేసింది. బైక్ ట్యాక్సీలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఓ రిపోర్ట్ అందించనుంది. అప్పటి వరకూ సర్వీస్‌లు నిలిపివేయాలని ప్రభుత్వం కోరింది. ఆ మేరకు సేవల్ని ఆపేశారు.
కర్ణాటకలో..
ఓలా, ఉబర్, ర్యాపిడో.. ఈ మధ్య ఎక్కడికి వెళ్లాలన్నా చాలా మంది ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కంపెనీలు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని, ఛార్జీల బాదుడును భారీగా పెంచేశాయి. దీంతో కర్ణాటక రవాణా శాఖ ఈ మూడు రైడ్ హైరింగ్ సర్వీసు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీలు తమ ఆటో సర్వీసులను ఆపివేయాలని గతేడాది అక్టోబర్‌లో ఆదేశించింది. ఈ సంస్థల ఆటోలు అక్రమంగా సర్వీసులను అందిస్తున్నాయని తెలిపింది. వెంటనే నివేదికను సమర్పించాలని ఈ వెహికిల్ అగ్రిగేటర్లను కర్ణాటక ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ ఆదేశించింది. ఓలా, ఉబర్.. 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి కూడా రూ.100 వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు రవాణా శాఖలో ఫిర్యాదులు నమోదు చేశారు. దీంతో రవాణా శాఖ గతేడాది అక్టోబర్ 6న ఈ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం.. మొదటి 2 కి.మీకి కనీస ఆటో ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15 వసూలు చేస్తారు.
Also Read: MV Ganga Vilas Launch: గంగా విలాస్ క్రూజ్ స్పెషాల్టీస్ అన్నీ ఇన్నీ కావు, పేరుకు తగ్గట్టే విలాసం