Rajnath Singh: ఏ నిముషానికి ఏమి జరుగునో, యుద్ధానికి సిద్ధమవండి - సైన్యానికి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు
Rajnath Singh: చైనాతో యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్ భారత సైన్యాన్ని ఆదేశించారు.
Rajnath Singh on China:
కమాండర్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యలు..
భారత్, చైనా మధ్య దాదాపు రెండేళ్లుగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న వివాదం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గల్వాన్ ఘటన తరవాత అది తారస్థాయికి చేరుకుంది. చర్చలు జరుగుతున్నా చైనా ఏ మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. డ్రాగన్‌కు గట్టి బదులు చెప్తామని భారత్ ముందు నుంచి చెబుతూనే ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అందుకు ఇండియా రెడీ అవుతున్నట్టే అనిపిస్తోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ కమాండర్లను హుటాహుటిన పిలిచి మీటింగ్ పెట్టారు. తూర్పు లద్దాఖ్ వద్ద ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యున్న స్థాయిలో అన్ని వ్యూహాలూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మిలిటరీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్. దేశ భద్రతకు కట్టుబడి ఉన్న సైనికులందరికీ కితాబునిచ్చారు. "భారత సైన్యంపై, వారి నాయకత్వంపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎలాంటి ఆపరేషన్లు చేపట్టేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి" అన్నారు రాజ్‌నాథ్. ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాడుతున్న సైన్యం నిబద్ధతను పొగిడారు. ఆత్మనిర్భరత సాధించేందుకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవటాన్నీ ప్రశంసించారు. ఐదు రోజుల పాటు మిలిటరీ కమాండర్ కాన్ఫరెన్స్ జరగనుంది. నవంబర్ 11న ముగియనుంది. ప్రస్తుత భద్రతా వ్యవస్థలో ఎదుర్కొంటున్న సవాళ్లపైనా ఈ సమావేశంలో చర్చించారు.
జిన్‌పింగ్ ఆదేశాలతోనే...
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవలే చైనా ఆర్మీకి చెందిన జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ని సందర్శించారు. ఆ సందర్భంగా "సైన్యానికి శిక్షణ కఠినతరం చేయండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి" అని అక్కడి ఉన్నతాధికారులకు సూచించారు. సైన్యం అంతా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అయితే...ఫలానా దేశంతో యుద్ధం అని చెప్పకపోయినా...పరోక్షంగా భారత్ గురించే ఆయన అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటారని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అటు తైవాన్‌తోనూ చైనాకు వివాదం ఉండటం వల్ల ఆ దేశం కూడా జిన్‌పింగ్ ఆదేశాలతో భయపడిపోతోంది. ఆ మధ్య యూఎస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించినప్పటి నుంచి చైనా, తైవాన్ మధ్య వైరం ఇంకా పెరిగింది. తైవాన్‌పై క్షిపణి దాడులకూ పాల్పడింది డ్రాగన్. తైవాన్‌ను తన భూభాగంలో కలుపుకోవాలని చూస్తున్న చైనా...అక్కడ అమెరికా జోక్యం చేసుకోవటంపై మండి పడుతోంది. అమెరికా మాత్రం తైవాన్‌కు అండగా ఉంటామని ప్రకటించింది. తైవాన్ మాత్రం తాము చైనాలో కలిసే ప్రసక్తే లేదని, తమది స్వతంత్ర దేశమని స్పష్టం చేస్తోంది. మొత్తానికి చైనా ఇరుగు పొరుగు దేశాలతో ఇలా తగువులు పెట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతానికి భారత్, చైనా మధ్య ఘర్షణలు మరింత తీవ్రమవుతాయన్న సంకేతాలతో ఇండియన్ ఆర్మీ ముందుగానే అప్రమత్తమవుతోంది. చైనా కవ్వింపు చర్యల్ని తిప్పి కొట్టేందుకు వ్యూహ రచన చేసుకుంటోంది.