Governars Vs Governaments : దక్షిణాదిన గవర్నర్లతో బీజేపీ రాజకీయం చేస్తోందా ? మూడు రాష్ట్రాల్లో వివాదాలెందుకు ?
బీజేపీకి దక్షిణాదిలో బలం లేదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ గవర్నర్లు మాత్రం ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ బలం గవర్నర్లేనా ?
Governars Vs Governaments : దక్షిణాదిలో కర్నాటక, ఏపీ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ గవర్నర్ వర్సెస్ సిఎం నువ్వా నేనా తేల్చుకుందాం అన్న రేంజ్ లో నడుస్తోంది. నిన్నటివరకు సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లు ఇష్యూ ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీయేతర ప్రభుత్వాలు వర్సెస్ గవర్నర్ల జోక్యం అన్న విధంగా మారిపోయింది. అంతేకాదు సౌత్ మొత్తం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మారుతోందా అన్న చర్చ మొదలవుతోంది. నిన్నటివరకు సౌత్ లో తెలంగాణకు మాత్రమే పరిమితమైన గవర్నర్ సమస్య ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు పాకింది. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న తమిళనాడు, కేరళలో కూడా గవర్నర్ వర్సెస్ సిఎం అంశం రాజకీయ దుమారాన్ని లేపుతోంది. దక్షిణా భారతంలో కర్నాటక తప్పించి మిగిలిన అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలే పాలన కొనసాగిస్తున్నాయి. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం కేంద్రంతో పాటు బీజేపీతో మైత్రీని కొనసాగిస్తుండటంతో అక్కడి గవర్నర్ హరిచందన్ తో ఎలాంటి ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వానికి రాలేదు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది.
కేసీఆర్ సర్కార్‌కు చిక్కులు తెచ్చి పెడుతున్న గవర్నర్ తమిళిసై
కొంత కాలంగా తెలంగాణలో గవర్నర్ తమిళిశై, సీఎం కేసీఆర్ మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు గవర్నర్ గా పగ్గాలు చేపట్టిన మొదట్లో అన్నా చెల్లెళ్లుగా కెసిఆర్- తమిళిసై బాగానే ఉన్నారు. కానీ ఎక్కడ చెడిందో తెలియదు కానీ బీజేపీతో కెసిఆర్ కి దూరం పెరగడంతో గవర్నర్ జోక్యం పెరిగిందని అధికారపార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. లేటెస్ట్ గా యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లును పెండింగ్ వ్యవహారం మరోసారి ఇద్దరి మధ్య అగ్నిరాజేసింది. మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత గవర్నర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాని కలిసి వచ్చిన మరుసటి రోజు నుంచి తమిళిసై దూకుడు మరింత పెంచారు. పదవి చేపట్టి మూడేళ్ల పూర్తయిన సందర్భంగా గవర్నర్ తమిళసై ఓ బుక్ ప్రచురించారు. దీన్ని అమిత్ షా కు అందజేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నర్ తమిళసై రాజభవన్ వేదికగా విమర్శానాస్త్రాలు సంధించారు. గతంలో ఏ గవర్నర్ మీడియా మీట్ లు, ప్రెస్ మీట్ లు పెట్టింది లేదు కానీ తెలంగాణ గవర్నర్ కొత్త కల్చర్ కు తెరతీశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఆమె ప్రైవసీకి భంగం కలుగుతోందని చెప్పారు. ‘తుషార్ నా మాజీ ఏడీసీ. తెలంగాణలో అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజల సమస్యల విషయంలో ఎల్లప్పుడూ సానుకూలంగానే స్పందిస్తాను. బిల్లులను తొక్కిపెట్టాననడం సబబు కాదు. బిల్లుపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని గవర్నర్ అన్నారు.
రాజకీయ విమర్శలూ చేస్తున్న తమిళిసై !
ప్రగతి భవన్‌లా కాదు.. రాజ్‌భవన్ తలుపులు తెరిచే ఉంటాయని చెబుతూ.. రాజకీయ విమర్శలు కూడా గవర్నర్ చేస్తున్నారు. కొంత మంది ప్రొటోకాల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నా పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తాను. గతంలో నా పర్యటనల్లో ప్రొటోకాల్ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. మీరు ప్రొటోకాల్ పాటించేవారైతే గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు మీకు నచ్చినట్లు చేయొచ్చు.. ప్రతిఒక్కరిపై ఆరోపణలు చేయొచ్చు. కేవలం రాజ్‌భవన్ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలని చెబుతున్నారు. రాజ్‌భవన్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎంతో మంది వచ్చి కలుస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారిని ఎవరూ అడ్డుకోవడం లేదు. ప్రగతిభవన్‌లా కాదు.. రాజ్‌భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా రాజ్‌భవన్‌కు రావొచ్చు... విజ్ఞప్తులు ఇవ్వొచ్చు'' అని గవర్నర్ తెలిపారు.
తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలంటున్న డీఎంకే !
తమిళనాడు గవర్నర్ కూడా డిఎంకె ప్రభుత్వంతో ఢీ కొడుతున్నారు. ఇటీవల అధికారపార్టీతోపాటు పలు తమిళపార్టీలు హిందీ భాషని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. దీంతో మొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న తమిళనాడులో ఇప్పుడు గవర్నర్ వర్సెస్ సిఎం మధ్య నిప్పు రాజేసుకుంది. అసలు మాకు ఈ గవర్నర్ వద్దని తమిళనాడు సిఎం స్టాలిన్ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాయడం రాజకీయ దుమారాన్ని లేపుతోంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు. వెనక్కి పంపిస్తున్నారు. పాలనకు అడ్డం పడుతున్నారని స్టాలిన్ మండి పడుతున్నారు.
కేరళలో యూనివర్శిటీలకు గవర్నర్ చాన్సలర్ కాదని ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం !
కేరళలో కూడా సేమ్ సీన్ రిపీటవుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం బిల్లు ఆమోదంపై మొదలైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. గవర్నర్ జోక్యాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న చట్ట సవరణ బిల్లుపై ఆమోదానికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పెండింగ్ లో పెట్టడంతో రాజ్ భవన్ ఎదుట అధికారపార్టీ నేతలు నిరసనకు దిగుతున్నారు. నిన్నటివరకు ఢిల్లీ, బెంగాల్లో సాగిన గవర్నర్ వర్సెస్ సిఎం వ్యవహారం ఇప్పుడు ఇప్పుడు సౌత్ లో ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.