Modi Biden Meet: నెలాఖరున అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ.. బైడెన్‌తో చర్చలు..
ప్రధాని మోదీ సెప్టెంబర్ నెలాఖరున అమెరికా వెళ్లే అవకాశాలున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించాక.. మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలాఖరున అమెరికా వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ చివరి వారంలో మోదీ వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ పయనమవుతారని తెలిపాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించాక.. మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్యలో మోదీ అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అధినేతను కలవడంతో పాటు.. బైడెన్ ప్రభుత్వంలో ఉన్న అగ్రశ్రేణి అధికారులతో మోదీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇండో పసిఫిక్ అంశాల గురించి ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. చైనాతో సరిహద్దు విషయాల్లో జరుగుతోన్న వివాదాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. మోదీ అమెరికా పర్యటన సమయంలోనే వాషింగ్టన్ డీసీలో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
ఇప్పటికే మూడు సమావేశాల్లో కలిసినా..
వర్చువల్ విధానం ద్వారా మోదీ, బైడెన్ మూడు సమావేశాల్లో కలిశారు. మార్చిలో జరిగిన క్వాడ్ సమ్మిట్, ఏప్రిల్ నెలలో జరిగిన క్లైమెట్ చేంజ్ సమ్మిట్, జూన్ నెలలో జరిగిన జీ 7 సమావేశాల్లో వీరు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. యూకేలో జరిగిన జీ 7 సమావేశంలో మోదీ పాల్గొనాల్సి ఉంది. అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ట్రిప్ రద్దయింది.
2019 సెప్టెంబర్‌లో..
అఫ్గానిస్తాన్ దేశాన్ని ఇటీవల తాలిబన్లు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ, బైడెన్ భేటీ కీలకం కానుంది. ప్రధాని మోదీ కోవిడ్‌కు ముందు అంటే 2019 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి హౌడీ మోదీ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
విదేశాంగ కార్యదర్శి భేటీతో..
ఇటీవల భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ అమెరికా వెళ్లారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, డిప్యూటీ సెక్రటరీ వెండీ షెర్‌మన్‌తో పాటు బైడెన్ ప్రభుత్వంలో ఉన్న పలువురు అధికారులను కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య గల వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలపై వారు చర్చలు జరిపారు. అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులతో పాటు.. పలు ప్రపంచ సమస్యలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. హర్షవర్ధన్ పర్యటన అనంతరం మోదీ కూడా అమెరికా వెళ్లనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.