New Rs 75 Coin: కొత్త పార్లమెంట్లో రూ.75 కాయిన్ని విడుదల చేసిన ప్రధాని
New Rs 75 Coin: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ రూ.75 కాయిన్ని విడుదల చేశారు.
New Rs 75 Coin:
రూ.75 స్టాంప్, కాయిన్ రిలీజ్
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.75 పోస్టేజ్ స్టాంప్‌ని, కాయిన్ని విడుదల చేశారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లోని లోక్‌సభ ఛాంబర్ వద్ద వీటిని రిలీజ్ చేశారు. పార్లమెంట్ ప్రారంభానికి గుర్తుగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వీటిని విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాయిన్ బరువు 34.65-35.35 గ్రాముల వరకూ ఉంటుందని వెల్లడించింది. ఈ కాయిన్‌కి ఓ వైపు అశోక స్తంభం, దానిపైన సింహం బొమ్మ ముద్రించారు.
#WATCH | Prime Minister Narendra Modi releases a stamp and Rs 75 coin in the new Parliament. pic.twitter.com/7YSi1j9dW9
— ANI (@ANI) May 28, 2023
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ కాయిన్ని విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రత్యేక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ కాయిన్ వివరాలనూ వెల్లడించింది. 44 మిల్లీమీటర్ల డయామీటర్‌తో ఉంటుందని తెలిపింది. ఈ కాయిన్ని 50% వెండి, 40% రాగి, 5%నికెల్, 5% జింక్‌తో తయారు చేశారు.
"కాయిన్‌పై అశోక పిల్లర్‌తో పాటు దానిపై పులి బొమ్మ ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అనే నినాదం రాసి ఉంటుంది. ఎడమ వైపున "Bharat" అని మెన్షన్ చేశాం. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. కుడివైపు ఇంగ్లీష్‌లో "INDIA" అని కనిపిస్తుంది. మరో వైపు పార్లమెంటరీ కాంప్లెక్స్ బొమ్మ ప్రింట్ అయ్యుంటుంది. పార్లమెంటరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్‌పై సన్సన్ సంకుల్ అని రాసి ఉంటుంది."
- నోటిఫికేషన్
కొత్త పార్లమెంట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్‌ని ప్రారంభించిన వెంటనే ఆయన సెంగోల్‌ని లోక్‌సభలో ఏర్పాటు చేశారు. మత గురువులు, సాధువుల పూజల మధ్య ఈ తంతు శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్‌ని ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. భారత దేశ సాధికారతకు ఇది చిహ్నంగా మారుతుందని ఆకాంక్షించారు. కలలన్నింటినీ నిజం చేసేందుకు ఇది వేదిక అవుతుందని వెల్లడించారు.
"భారత దేశ కొత్త పార్లమెంట్ ప్రారంభించుకున్నాం. మనందరి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. నమ్మకంతో నిండిపోయాయి. మన దేశ సాధికారతకు ఈ భవనం నిలువెత్తు నిదర్శనంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం. కొత్త కలలను కనడంతో పాటు వాటిని నిజం చేసుకునేందుకు ఇది వేదికగా మారుతుందని ఆశిస్తున్నాను. మన దేశ స్థాయిని పెంచడమే కాకుండా..కొత్త శిఖరాలు చేరుకోడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నాను. మన దేశం మరింత శక్తిమంతంగా మారుతుందని నమ్ముతున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ