యువరాజు ఏమీ చేయలేకపోతున్నారు, రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
PM Modi Speech: రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ రాజ్యసభలో సెటైర్లు వేశారు.
PM Modi Speech in Rajya Sabha: రాజ్యసభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ఎప్పుడూ లేనంత స్థాయిలో విరచుకుపడ్డారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీపైనా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని Start Up లా అందరి ముందుకి తీసుకొచ్చిందని కానీ...ఆయన నాన్ స్టార్టర్‌గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆయన ఎదగరు, పార్టీనీ ఎదగనివ్వరు అంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని యువరాజు అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానమిస్తూ చాలా సేపు ప్రసంగించారు. అంతకు ముందు కూడా రాహుల్‌పై ఇలాంటి సెటైర్లే వేశారు ప్రధాని మోదీ. ఒకటే ప్రొడక్ట్‌ని పదేపదే లాంఛ్ చేస్తున్నారని అన్నారు. ప్రతిసారీ కాంగ్రెస్ విఫలమవుతూనే ఉందని స్పష్టం చేశారు. ఆ పార్టీకి కాలం చెల్లిపోయిందని,ప్రజల విశ్వాసం కోల్పోయిందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పతనాన్ని చూసి తమకు జాలేస్తోందని, ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు.
"కాంగ్రెస్ పార్టీ యువరాజుని (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) అందరి ముందుకు తీసుకొచ్చింది. కానీ ఆయన ఓ నాన్ స్టార్టర్‌గా మిగిలిపోయారు. ఆయన పార్టీని ఎదగనివ్వరు. ఆయనా ఎదగరు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రొడక్ట్‌ని పదేపదే లాంఛ్ చేస్తోంది. ప్రతిసారీ విఫలమవుతోంది. ఆ పార్టీ ఐడియాలజీకి కాలం చెల్లింది. అన్ని ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇలా పతనం అవుతుండడాన్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. ఆ పార్టీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | In Rajya Sabha, Prime Minister Narendra Modi says, "...They have made a start-up for their 'Yuvraj'. But he is a non-starter, he neither lifts nor launches..." pic.twitter.com/QvTlnuo1lD
— ANI (@ANI) February 7, 2024
గుజరాత్‌ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసిందని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తనను కేంద్రమంత్రులతో కలవనివ్వలేదని మండిపడ్డారు. నెహ్రూ అప్పట్లో రిజర్వేషన్‌లపై ముఖ్యమంత్రులకు రాసిన లేఖని సభలో చదివి వినిపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు.తమకు 400 సీట్లు రావాలని ఖర్గే ఇలా ఆశీర్వదించారంటూ సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. ఆలోచనల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు. పాత పార్లమెంట్ భవనంలోనూ తాను మాట్లాడుతుంటే ఇదే విధంగా అంతరాయం సృష్టించారని..కాంగ్రెస్ నేతలు సభలో వినేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండరని విమర్శించారు. కానీ తన గొంతుకను ఎవరూ అణిచివేయలేరని, ఇది దేశ ప్రజలు ఇచ్చిన గొంతు అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లోనే ఉగ్రవాదం, తీవ్రవాదం విపరీతంగా పెరిగాయని మండి పడ్డారు.
"SC,ST,OBC రిజర్వేషన్లు ఇస్తే ప్రభుత్వ స్థాయి పడిపోతుందని నెహ్రూ అనే వారు. ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్‌లను వ్యతిరేకించారు. ఉద్యోగుల నియామకాలనూ ఆపేశారు. ఇదొక్కటి చాలు కాంగ్రెస్ వైఖరి ఏంటో అర్థం చేసుకోడానికి. SC,ST వర్గాలకు ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేకంగానే పరిపాలించింది. కానీ మేం ఆదివాసులకు, దళితులకు ప్రాధాన్యతనిచ్చాం. వాళ్లూ ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు పొందుతున్నారు"
- ప్రధాని నరేంద్ర మోదీ