RK : ఆర్కేకు లాల్ సలాం ! అంత్యక్రియల ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు !
మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయనకు సహచర మావోయిస్టులందరూ లాల్ సలాం చెప్పారు. అంత్యక్రియల ఫోటోలను విడుదల చేశారు.
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అంత్యక్రియలు తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో పూర్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టులు అధికారికంగా ఫోటోలను కూడా విడుదల చేశారు. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ఆర్కే అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు. అంత్యక్రియలను మావోయిస్టు లాంఛనాలతో పూర్తి చేశారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు, అటవీ గ్రామాల ప్రజలు హాజరైనట్లుగా తెలుస్తోంది.
Also Read : మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. నిర్ధారించిన పార్టీ కేంద్ర కమిటీ
చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే గురువారం సాయంత్రం చనిపోయారని ఒక్క సారిగా సమాచారం బయటకు వచ్చింది. అయితే మావోయిస్టులు మాత్రం శుక్రవారం నిర్ధారించారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారని.. కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామన్నారు. అయితే అభయ్ పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో అంత్యక్రియలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కానీ లేఖ విడుదల చేసిన సమయంలోనే పామేడు- కొండపల్లి ప్రాంతాల్లో అంత్యక్రియలు చేస్తున్నట్లుగా తాజాగా విడుదలైన ఫోటోలతో తెలుస్తోందని అంటున్నారు.
యుక్త వయసులోనే ఉద్యమ బాట పట్టి నక్సల్స్‌లోచేరిపోయిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే 40 ఏళ్ల పాటు ఉద్యమంలోనే గడిపారు. ఎన్నో సార్లు ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. చివరుకు అనారోగ్యంతో కన్ను మూశాడు. ఆయన కుమారుడు కూడా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయారు. ఆయన భార్య శిరిష కూడా ఉద్యమంలో పని చేసినా.. లొంగిపోయారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో నివసిస్తున్నారు. ఆర్కేకు అనారోగ్యం అని తెలిసినా వైద్య సాయం అందకుండా కట్టుదిట్టం చేసి చనిపోయేలా చేశారని ఆర్కే సతీమణి ఆరోపిస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్యేననంటున్నారు.
Also Read : రూ.100 కోసం వ్యక్తి హత్య.. కత్తితో ఛాతిలో పొడిచి దారుణం
ఆర్కే మృతిలో మావోయిస్టుల్లో ఓ శకం ముగిసిందని అంటున్నారు. మావోయిస్టులకు అన్ని విషయాల్లో మార్గదర్శకుడిగా ఉంటున్న ఆయన కన్నుమూయడంతో మావోయిస్టు పార్టీకి.. ఆ పార్టీ ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోకపోయినా.. అనారోగ్యంతో ఆర్కే చనిపోవడంతో పోలీసులు కూడా గట్టి దెబ్బకొట్టగలిగామని భావిస్తున్నారు.
Also Read: Revanth Reddy: డీఎస్‌ను కలిసిన రేవంత్.. ఆయన ఇంటికెళ్లి భేటీ, కారణం ఏంటంటే..