Rafah News: అప్పుడు మీ కళ్లను కాకులు ఎత్తుకెళ్లాయా? రఫాపై పోస్ట్‌లకు ఇజ్రాయేల్ ఘాటైన కౌంటర్
Israel Hamas War: రఫాపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్న క్రమంలోనే ఇజ్రాయేల్ ఘాటైన కౌంటర్ ఇచ్చింది.
Isarel Attack on Rafah: ఇజ్రాయేల్ రఫాపై దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి All Eyes on Rafah హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ప్రముఖులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోని షేర్ చేసి రఫా ప్రజలకు మద్దతునిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానవతావాద సంస్థలూ ఇదే పోస్ట్‌ని షేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ చాలా ఘాటుగా స్పందించింది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి చేసినప్పుడు మీ కళ్లు ఏమైపోయాయి అంటూ ప్రశ్నించింది. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. "అక్టోబర్ 7వ తేదీ గురించి మేం మాట్లాడకుండా ఉండం. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న మా పౌరులను విడిపించుకునేంత వరకూ పోరాటాన్ని ఆపం" అని తేల్చి చెప్పింది. ఓ ఫొటో కూడా షేర్ చేసింది. దానిపై "Where Were Your Eyes on Ocobe 7" అని రాసి ఉంది. ఆ పోస్టర్‌నే ఇప్పుడు వైరల్ చేస్తోంది. #AllEyesonRafah కి కౌంటర్‌గా ఈ ఇమేజ్‌ని షేర్ చేసింది.
We will NEVER stop talking about October 7th.
— Israel ישראל (@Israel) May 29, 2024
We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM
హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేసినప్పుడు పోస్ట్‌లు ఎందుకు పెట్టలేదంటూ గట్టిగానే ప్రశ్నించింది ఇజ్రాయేల్. అక్టోబర్ 7 వ తేదీన హమాస్ చేసిన దాడుల్లో దాదాపు 1,160 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు. 250 మందిని బంధించారు. వాళ్లలో కొంతమందిని గతేడాది డిసెంబర్‌లో విడుదల చేశారు. ఇంకా కొంత మంది వాళ్ల చెరలోనే ఉన్నారు. ఇప్పటి వరకూ హమాస్ ఉగ్రవాదుల వద్ద 99 మంది బందీలుగా ఉన్నారని, 31 మంది చనిపోయారని ఇజ్రాయేల్ చెబుతోంది. ఇక హమాస్‌ని అంతం చేసేందుకు ఇజ్రాయేల్ చేసిన దాడుల్లో కనీసం 31 వేల మంది పౌరులు చనిపోయి ఉంటారని అంచనా. ఇక రఫాపై చేసిన దాడిలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో చిన్నారులూ ఉన్నారు. దీనిపైనే అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.