Indian Covid Drugs: చైనాలో బ్లాక్ మార్కెట్ దందా- భారత్ కొవిడ్ మందులకు భారీ డిమాండ్!
Indian Covid Drugs: చైనాలో భారత్ కొవిడ్ మందులకు భారీగా డిమాండ్ పెరిగింది. బ్లాక్ మార్కెట్‌లో భారత్ కొవిడ్ మందుల రేటు భారీగా పెరిగింది.
Indian Covid Drugs: కరోనా విజృంభణ కారణంగా చైనాలో ఔషధాల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీంతో బ్లాక్ మార్కెట్ దందా మొదలైంది. జనరిక్ కొవిడ్-19 ఔషధాలు ఫార్మసీలో దొరకకపోయేసరికి ప్రజలు బ్లాక్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం, దేశంలో ఆమోదించిన కొవిడ్-19 యాంటీ వైరల్ మెడిసిన్ సరఫరా పరిమితంగా ఉంది. అందులోనూ వాటి ధరలు ఆకాశ్నంటాయి. దీంతో ప్రజలు.. భారత్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న జనరిక్ మందుల వైపు పరుగులు పెడుతున్నారు.
ఈ పేర్లతో
భారత్ నుంచి నాలుగు రకాల జనరిక్ యాంటీ కొవిడ్ మందులు.. చైనా మార్కెట్‌లో చట్టవిరుద్ధంగా అమ్ముడవుతున్నాయి. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ బ్రాండ్ పేర్లతో వీటిని బ్లాక్ మార్కెట్ దందా చేస్తోంది.
చైనా ఈ సంవత్సరం రెండు కొవిడ్-19 యాంటీ వైరల్‌లను ఆమోదించింది. ఫైజర్స్ కంపెనీకి చెందిన పాక్స్‌లోవిడ్, చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్ నుంచి వచ్చి HIV ఔషధం అజ్వుడిన్‌ను చైనా ఆమోదించింది. కానీ ఈ రెండు మందులు కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ధరలు
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో ఈ మందులను పొందేందుకు పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ను నియంత్రించే భారతీయ జనరిక్ మందులు ఒక్కో బాక్స్‌కు 1,000 యువాన్ (US$144) చొప్పున విక్రయిస్తున్నట్లు ఉన్న పోస్ట్ Weiboలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
పాక్స్‌లోవిడ్ ఒక బాక్స్‌కు 2,980 యువాన్‌లు (సుమారు రూ. 35432) ధర ఉండగా, భారతీయ నిర్మిత ఔషధాల బాక్స్‌ను 530 (రూ. 6300 సుమారు.) నుండి 1,600 యువాన్‌ల (సుమారు రూ. 19000) వరకు కొనుగోలు చేస్తున్నారు.
నేరం
భారతీయ జనరిక్ ఔషధాలను చైనా ప్రభుత్వం ఆమోదించలేదని, వాటిని విక్రయించడం శిక్షార్హమైన నేరమని ఈ నివేదిక పేర్కొంది. చైనా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చట్టం ప్రకారం.. విదేశాలలో విక్రయించిన మందులు, చైనాలో ఆమోదించని ఔషధాలు నకిలీవిగా గుర్తిస్తారు. అయితే వాటిని పంపిణీ చేసేవారిపై లైసెన్స్ లేకుండా అక్రమ దిగుమతులు చేస్తున్నారని జరిమానాలు విధిస్తోంది ప్రభుత్వం.
మెసేజింగ్ యాప్ వీచాట్‌లో లైసెన్స్ లేని సేల్స్‌పర్సన్‌లతో సహా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా మందులను కొనుగోలు చేయవద్దని అక్కడి వైద్యులు ప్రజలను కోరుతున్నారు. దీని వల్ల కొత్త రోగాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఆసుపత్రులు
మరోవైపు జీరో కొవిడ్ పాలసీతో పాటు కఠిన ఆంక్షలు ఎత్తేసినప్పటి నుంచి చైనాలో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ సహా పలు ముఖ్యమైన నగరాల్లోని ఆసుపత్రులన్నీ చాలా బిజీగా ఉన్నాయి.
ఒకేసారి ఆంక్షలను సడలించడంతో దేశంలో కొవిడ్ నియంత్రణ లేకుండా వ్యాప్తి చెందుతుందని, రోజుకు మిలియన్ల మంది ప్రజలకు కరోనా సోకుతుందని కొంతమంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు తెలిపారు. నైరుతి చైనీస్ నగరమైన చెంగ్డులో హుయాక్సి హాస్పిటల్ సిబ్బంది.. రోగులతో బిజీబిజీగా ఉన్నారు. డిసెంబర్ 7 నుంచి చైనాలో ఆంక్షలు సడలించడంతో ఆసుపత్రి రద్దీగా మారిందని వారు తెలిపారు.
"నేను 30 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. కానీ ఆసుపత్రి ఇంత రద్దీగా ఉండటం ఎప్పడూ చూడలేదు." అని ఆసుపత్రి వెలుపల ఉన్న ఒక అంబులెన్స్ డ్రైవర్ తెలిపాడు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, పక్కనే ఉన్న ఫీవర్ క్లినిక్ బయట కిలో మీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి.
Also Read: Tamil Nadu Covid Cases: తమిళనాడుకు వచ్చేసింది- చైనా నుంచి వచ్చిన తల్లీబిడ్డలకు కరోనా!