Pitch Invader WC Final: మ్యాచ్ జరుగుతుండగా పిచ్‌లోకి దూసుకొచ్చిన వ్యక్తి, బయటకు లాగేసిన భద్రతా సిబ్బంది
World Cup Match Final: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా ఓ వ్యక్తి పిచ్‌లోకి దూసుకొచ్చి కాసేపు టెన్షన్ పెట్టాడు.
World Cup Match Final 2023:
పిచ్‌లోకి వచ్చిన వ్యక్తి..
భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైన్ మ్యాచ్ (World Cup Match Final) ఉత్కంఠగా జరుగుతుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి పిచ్‌లోకి దూసుకొచ్చి కాసేపు టెన్షన్ పెట్టాడు. 14వ ఓవర్ ముగిసిన తరవాత ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకుని సడెన్‌గా లోపలికి వచ్చేశాడు. వైట్ టీషర్ట్, రెడ్ ట్రౌజర్ వేసుకున్న ఆ వ్యక్తి నేరుగా విరాట్ కోహ్లి దగ్గరికి పరుగులు పెట్డాడు. పాలస్తీనా నేషనల్ ఫ్లాగ్ ఉన్న మాస్క్‌ని పెట్టుకున్న ఆ వ్యక్తి టీషర్ట్‌పై పాలస్తీనాకి మద్దతుగా స్లోగన్ కనిపించింది. "పాలస్తీనాపై దాడులు ఆపండి" అనే స్లోగన్ ఉంది. ముందు వెనక ఇదే స్లోగన్ కనిపించింది. కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ కూడా ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు గ్రౌండ్‌లోకి దూసుకురావడం కామనే. గతంలో చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. తమ ఫేవరెట్ ప్లేయర్‌ని కలుసుకునేందుకు సెక్యూరిటీని దాటుకుని మరీ గ్రౌండ్‌లోకి పరిగెత్తుతుంటారు. కానీ...ఈసారి ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాలస్తీనా సపోర్టర్ ఇలా దూసుకురావడం కలకలం సృష్టించింది. కోహ్లి వెనక్కి వెళ్లిన ఆ వ్యక్తి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆలోగా భద్రతా సిబ్బంది వచ్చి వెనక్కి లాగేసింది.
A fan tried to hug Virat Kohli in the World Cup final. pic.twitter.com/0NP031l6Sq
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
గత నెల చెన్నైలో M.A. Chidambaram Stadiumలో భారత్, ఆస్ట్రేలియా మధ్య లీగ్ గేమ్ జరిగింది. ఆ సమయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డానియెల్ జార్విస్ అలియాస్ జార్వో పిచ్‌లోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. దీనిపై సీరియస్ అయిన ICC వరల్డ్ కప్ మ్యాచ్‌కి మళ్లీ రాకుండా బ్యాన్ విధించింది. VIP ఏరియాలోకి వచ్చి సెక్యూరిటీ లేయర్స్‌ని దాటుకుని మరీ పిచ్‌లోకి ఎలా వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు పాలస్తీనా సపోర్టర్ లోపలికి రావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది.
కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 10.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే విరాట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 29వ ఓవర్‌లో వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్‌కు 109 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ హాఫ్ సెంచరీతో టోర్నీలో కోహ్లీ 750 పరుగుల మార్కును దాటాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో 750+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. హాఫ్ సెంచరీతో 48 ఏళ్ల ప్రపంచకప్‌లో సెమీఫైనల్, ఫైనల్లో 50+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించాడు. కివీస్ జట్టుపై 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు.