AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ, కొత్త బార్ లైసెన్స్ పాలసీ సహా చర్చించే కీలక అంశాలివే
AP CM Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశం అయింది. స్త్రీ శక్తి పథకం సహా పలు అంశాలపై ఏపీ మంత్రివర్గ భేటీలో చర్చ జరుగుతోంది.

Andhra Pradesh Cabinet Meeting | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది. ఈ కేబినెట్ భేటీలో దాదాపు పది కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. మహిళలకు ఉచిత బస్సు పథకం, కొత్త బార్ లైసెన్స్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, పర్యాటక శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.
ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..
స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది.
2024-29 ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీపై చర్చించి, నిర్ణయం తీసుకోనుంది.
పర్యాటక శాఖ పరిధిలో ఉన్న 22 హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణకు ఏజెన్సీని ఎంపిక చేయడంపై నిర్ణయం తీసుకొని, ఆ అధికారాన్ని ఆ శాఖ ఎండీకి అప్పగించడంపై చర్చ జరగనుంది.
కొత్త బార్ లైసెన్స్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదికకు ఆమోదం ఇవ్వనున్నారు. అలాగే, మద్యం షాపుల్లో పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వనున్నారు.
నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
మీడియా అక్రిడిటేషన్ కొత్త నిబంధనలపై కూడా చర్చించనున్నారు.






















