Rohit Sharma Virat Kohli ODI Future | ఇంగ్లండ్ లో కుర్రాళ్లు అదరగొట్టేడయంతో ఆలోచనలో బీసీసీఐ | ABP Desam
ఇంగ్లండ్ లో టెస్ట్ క్రికెట్ మజా ఏంటో చూపించారు కుర్రాళ్లు. గతంలో ఎంతో మంది సీనియర్లు ఆడినా రానంత హైప్ ఇంగ్లండ్ భారత్ ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ కు వచ్చింది. ప్రతీ టెస్టును ఐదు రోజులకు తీసుకువెళ్తూ గెలిచినా ఓడినా ఎడతెగని పోరాటం చేసిన కుర్రాళ్ల ఆటకు క్రికెట్ ప్రపంచమే ఫిదా అయ్యింది. సంచలన రీతిలో ఆఖరి టెస్ట్ గెలిచి సిరీస్ ను భారత్ 2-2 తో డ్రా చేసుకున్న తర్వాత ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదే వన్డేలకు సీనియర్లను తప్పించాలి. హిట్ మ్యాన్ గా ఫ్యాన్స్ ను అలరించి ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ, పరుగుల యంత్రంలా మారి క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన విరాట్ కొహ్లీలు వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇవ్వాలనేది కొత్త ప్రతిపాదన. వాస్తవానికి 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే నిర్ణయంతోనే కొహ్లీ, రోహిత్ లు టీ20 లు వదిలేశారు. ఆ తర్వాత గంభీర్ కోచ్ గా రావటం తదనంతరం జరిగిన పరిణామాలతో ప్రాణంలా భావించే టెస్టులను వదులుకున్నారు ఈ ఇద్దరు యోధులు. కానీ ఇప్పుడు టీం ఇండియా మేనేజ్మెంట్ ప్రతిపాదన ఏంటంటే టీమ్ మొత్తం యువరక్తంతో నిండిపోవాల్సిన సమయం వచ్చిందని. 2027 వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మకు 41 సంవత్సరాల వయస్సు వస్తుంది...కొహ్లీకి 40 ఏళ్ల వయస్సు వస్తుంది. రోహిత్, కొహ్లీ లు ఫిట్ నెస్ తో అప్పటికి ఉన్నా కూడా మరో రెండేళ్లు వాళ్లే ఇదే ఫార్మాట్ లో కొన సాగటం అంటే మరో కుర్రాడికి రెండేళ్ల అవకాశాన్ని కట్ చేయటం అనే ఆలోచనతో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు...ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొహ్లీ, రోహిత్ లు దేశానికి అందించిన క్రికెట్ సేవల దృష్ట్యా వారి నిర్ణయానికి గౌరవం ఇస్తూనే...భవిష్యత్ పై వారే స్వయంగా నిర్ణయం తీసుకునేలా చేస్తామని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు లీక్ చేయటం ఇప్పుడు ఈ విషయం వెలుగు చూసేలా చేసింది. జరిగేలా ప్రొసీజర్ అంతా చాలా ప్రొఫెషనల్ గానే ఉంటుందని వారి అంగీకారంతోనే ప్రక్రియ జరుగుతుందని ఆ అధికారి చెప్పటం చూస్తుంటే ఆల్రెడీ ఆ దిగ్గజాలను సాగనంపటానికి బీసీసీఐ పొగ పెట్టడం మొదలుపెట్టిందని..అందుకే విషయం బయటకు లీక్ అయిందని చెబుతున్నారు. చూడాలి మరి రోహిత్, కొహ్లీ దీనిపై ఎలా స్పందిస్తారో.





















