MBBS Seats: స్థానికతపై ఆ విద్యార్థులకు భారీ ఊరట! ఎంబీబీఎస్‌లో 2028 నుంచి అమలు చేయాలన్న సుప్రీంకోర్టు
Medical Colleges in Telangana | నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు నాలుగేళ్లు తెలంగాణలో చదవాలన్న స్థానికత నిబంధనపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది

Supreme Court on Local Status in MBBS Seats | న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌లో స్థానిక కోటా కింద సీట్లు పొందాలంటే, విద్యార్థులు నీట్ పరీక్షకు ముందు వరుసగా 4 సంవత్సరాలు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 2028 నుంచి వరుసగా నాలుగేళ్ల స్థానికత నిబంధనను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌చంద్రన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం వాదనలు విన్న అనంతరం విచారణను ముగించినట్లు తెలిపింది. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే శుక్రవారంలోపు లిఖితపూర్వకంగా సమర్పించాలంటూ సుప్రీం ధర్మాసనం సూచించింది.
"స్థానికత సమస్యకు పరిష్కార మార్గాలు చూపండి, లేకపోతే పిటిషన్ ఖారిజు చేస్తాం" అని సీజేఐ జస్టిస్ గవాయ్ జూలై 23న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ "మా వాదనలు వినిపించాలన్నదే ఉద్దేశం, పరిష్కార మార్గాలు కాదు" అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ‘‘తెలంగాణ శాశ్వత నివాసులైన విద్యార్థులు ఇంటర్మీడియట్ 2 ఏళ్లు తెలంగాణలో చదవకపోయినా, వారికి ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలి’’ అని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు సీజేఐ సూచించారు. ఆ ఉత్తర్వులు ఇవ్వడానికి ముందు తమ వాదనలు వినాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోరడంతో సీజేఐ అంగీకరించారు.
నిబంధనలపై తెలంగాణ వాదనలు
అనంతరం సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఎంబీబీఎస్ సీటుకూ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి వరకూ ఖర్చు పెడుతోంది. ఆ సీట్లు రాష్ట్రానికి చెందిన స్థానిక పేద, మధ్య తరగతి విద్యార్థులకే అవకాశం అందించాలన్న ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొచ్చాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి ప్రకారం ఉంది. కర్ణాటక, అస్సాం, హరియాణాల్లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయి’’ అని వివరించారు.
రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ... అంతర్రాష్ట్ర బదిలీలు ఉన్న ఉద్యోగుల పిల్లలకు (అఖిల భారత సర్వీసులు, జడ్జిలు, సైనికులు, పారామిలిటరీ దళాలు మొదలైనవారు) ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తామన్న హామీ పత్రాన్ని కోర్టులో సమర్పించారు.
స్థానికతపై సీజేఐ సూటి ప్రశ్నలు
జస్టిస్ గవాయ్ వారి వాదనలపై స్పందిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. “రాష్ట్రంలో పుట్టిన విద్యార్థి, పదో తరగతి వరకు ఇక్కడే చదివాడు. తల్లిదండ్రులూ ఇక్కడే నివసిస్తున్నారు. కానీ ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివాడని ఎంబీబీఎస్ సీటును నిరాకరించడం కరెక్టేనా?. “జేఈఈ/నీట్ శిక్షణ కోసం దేశం నలుమూలల విద్యార్థులు కోటా (రాజస్థాన్) వెళ్తున్నారు. వాళ్ల పరిస్థితి ఏంటి?”. తెలంగాణ నుంచి ఐఏఎస్ అధికారి ఢిల్లీకొస్తే, ఆయన కుమారుడు అక్కడ చదివితే తెలంగాణలో సీటుకు అర్హత కోల్పోతాడా?”ఈ నిబంధన అకస్మాత్తుగా తీసుకరావడం వల్ల, విద్యార్థులు ఆ రెండో రాష్ట్రంలో కూడా స్థానికత పొందలేడు. కనుక ప్రభుత్వ నిబంధనలను అంగీకరించలేం.
సుప్రీంకోర్టు సూచన ఇదే..
‘తెలంగాణ ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విషయంలో ఈ స్థానికత నిబంధనను అమలు చేయాలనుకుంటే, 2028 నుంచి మొదలుపెట్టాలి. ఇది ముందుగానే తెలియడం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయంపై జాగ్రత్త పడతారు. ఇతర రాష్ట్రాల్లో చదివినా, విదేశాల్లో చదివినా ఆ విద్యార్థులు రాష్ట్రానికి చెందిన వారే. వేరే ప్రాంతాల్లో చదివారన్న కారణంగా వారిని ఎంబీబీఎస్ సీట్లలో స్థానికులుగా పరిగణించకపోవడం సరికాదు’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.






















