అన్వేషించండి
Advertisement
Netaji Jayanti 2022: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు?
చాలామంది భారతీయుల మదిలో మెదిలే ప్రశ్న.. నేతాజీ కి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని.. ! గాంధీ, నెహ్రూల స్థాయిలో దేశ ప్రజలను ఉత్తేజితుల్ని చేసిన సుభాష్ చంద్ర బోస్ భారతరత్నకు అర్హుడు కాదా ? అసలు దాని వెనక ఉన్న కారణమేంటి?
స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో ప్రతిష్ట కలిగిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అనడం లో ఏమాత్రం సందేహం లేదు. నేతాజీ గా ప్రజలంతా అభిమానంగా పిలుచుకునే బోస్ స్వాతంత్య్ర పోరాట సందర్భంగా " మీ రక్తాన్ని ధారపోయండి .. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను " అంటూ ఇచ్చిన నినాదం భారతీయుల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది . ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన నుంచి 1945 ఆగస్టు 18న తైవాన్ లో విమాన ప్రమాదం తర్వాత అదృశ్య మయ్యేవరకూ నేతాజీ ప్రస్థానం చాలా గొప్పది. బ్రిటీష్ కళ్లుగప్పి ఆఫ్ఘనిస్తాన్ , రష్యా ,ఇటలీ, జర్మనీలకు తప్పించుకుని వెళ్లడం, సింగపూర్ లో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయడం లాంటి సాహసాలు ఆయనకు ఒక హీరో స్టేటస్ ను తెచ్చి పెట్టాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైన ఆయన.. విమాన ప్రమాదంలో మరణించలేదనే అభిమానులు ఇప్పటికీ భావిస్తారు. అంతెందుకు చరిత్రకారుల్లో సైతం బోస్ అదృశ్యంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అయితే ఎంతో పేరు ప్రతిష్టలూ కలిగిన నేతాజీకి భారతఅత్యున్నత పురస్కారం భారతరత్న ఎందుకు రాలేదు అన్న అనుమానం సగటు భారతీయుడిలో ఉన్నమాట వాస్తవం. వివరాల్లోకి వెళితే జనవరి 2,1954 లో స్థాపించబడినప్పటి నుంచీ భారతరత్న పురస్కారం అనేక మందికి ఇచ్చారు. కేవలం భారతీయులే కాకుండా సరిహద్దు గాంధీగా పిలువబడిన పాకిస్తాన్ కు చెందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987), దక్షిణాఫ్రికా కు చెందిన నల్ల జాతి సూరీడుగా పిలువబడే నెల్సన్ మండేలా (1990) లకు కూడా భారతరత్న వచ్చింది. అయితే సుభాష్ చంద్ర బోస్ విషయంలో మాత్రం భారతరత్న ఇవ్వడంపై ఆలోచనలు చేశారు. ఎట్టకేలకు 1992లో రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుంచి నేతాజీ కి మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ఈ పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఎందుకంటే 1945 లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా అంగీకరించలేదని, అలాంటి సమయంలో ఆయనకి మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారని ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్రశ్నించాడు. సుభాస్ చంద్రబోస్ ఆచూకీని షానవాజ్ కమిటీ (1956), ఖోస్లా కమిషన్ (1970) నివేదికల ఆధారంగా కనిపెట్టాలని ఫిర్యాది తన వ్యాజ్యంలో అభ్యర్థించాడు. ఈ రెండు కమిటీలు విమాన ప్రమాదంలో బోస్ మరణించాడా లేదా అన్న విషయం పై నిర్దారణ కోసం నియమించబడినవి. వాటిలో ఒకటి బోస్ ఆ ప్రమాదంలో మరణించి ఉంటాడని చెబితే, ఖోస్లా కమిషన్ ఇదే అంశాన్ని లీగల్ బ్యాక్ గ్రౌండ్ లో విచారించింది కానీ బోస్ మరణంపై స్పష్టత ఇవ్వలేదు. దీనితో బోస్ మరణించాడా లేదా అన్నది స్పష్టం కాలేదు కాబట్టి సాంకేతిక కారణాల అడ్డు పడుతున్నాయంటూ ప్రభుత్వం నేతాజీ కి ప్రకటించిన భారత రత్నపురస్కారాన్ని 1997లో చట్ట పరమైన ఆదేశాలతో వెనక్కు తీసుకుంది. అయితే 2005లో ముఖర్జీ కమిషన్ అసలు తైవాన్ లో ఆ తేదీన ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదని చెప్పింది. దానితో నేతాజీ మరణంపై అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి.
కుటుంబ సభ్యుల నిరాకరణ
మరోవైపు సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు. 2016లో నేతాజీకి చెందిన కొన్ని రహస్య పత్రాలను ప్రభుత్వం బయటపెట్టింది . వాటిలో ఆయనకు భారతరత్న ఇవ్వాలని అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు ప్రయత్నించారని అయితే సాంకేతిక కారణాలు అడ్డుపడ్డాయని బహిర్గతమైంది. బోస్ కుమార్తె అయిన అనితా బోస్ మాత్రం తన తండ్రికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ పై విముఖత వ్యక్తం చేసింది. నేతాజీ కంటే తక్కువ స్టేచర్ ఉన్న వ్యక్తులకూ భారతరత్న ఇచ్చేస్తున్న నేపథ్యంలో తన తండ్రికి ఆ పురస్కారం అవసరం లేదని చెప్పింది. సుభాష్ చంద్రబోస్ స్థాయి ఇలాంటి వాటికంటే ఎంతో ఉన్నతమైంది అని ఆమె అభిప్రాయపడగా, నేతాజీ ఇతర కుటుంబ సభ్యులూ అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బోస్ అందించిన సేవలను ప్రభుత్వాలు పాజిటివ్ దృక్కోణంలో చూస్తుండడాన్ని వారు ఆహ్వానించారు.
దేశప్రజల గుండెల్లో నేతాజీ ఎప్పుడూ "రత్న"మే
కమిషన్ లు, కమిటీలూ, ప్రభుత్వాలూ ఏం చెప్పినా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఒక హీరోనే. వారి హృదయాల్లో నిరంతరం ప్రవహించే ఉత్తేజ తరంగమే ఆయన. ప్రభుత్వాలు ప్రకటించినా లేకున్నా తరాలు గడిచినా దేశ ప్రజల మనసుల్లో మాత్రం నేతాజీ శాశ్వతంగా నిలిచిపోయే భారతరత్నమే..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement