Vande Bharat Sleeper: చుక్క నీరు కింద పడలేదు, మొబైల్ కూడా కదల్లేదు - 180 కి.మీల వేగంతో దూసుకెళ్లిన వందేభారత్, వీడియో చూశారా?
Viral Video: మరికొన్ని నెలల్లోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 180 కి.మీ వేగంతో దూసుకెళ్లింది.
Vande Bharat Sleeper Trains Speed Trails: వందేభారత్ (Vande Bharat).. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది. తక్కువ టైంలో ఎక్కువ దూరం సకల సౌకర్యాలతో కూడిన రైలు ప్రయాణం. ఇప్పటివరకూ సీటింగ్‌లో వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టగా మంచి ప్రజాదరణ పొందాయి. ఈ క్రమంలోనే దేశంలో తొలిసారిగా వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గంటకు గరిష్ఠంగా 180 కి.మీల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vasishnaw) సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
చుక్క నీరు కింద పడలేదు
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు 180 కి.మీల వేగంతో దూసుకెళ్లినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కిందపడలేదు. కనీసం పక్కన ఉన్న మొబైల్ కూడా కదల్లేదు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు ఈ పరీక్షలను రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో నిర్వహించారు.
క్రమక్రమంగా వేగం పెంచారు..
తొలుత జనవరి 1వ తేదీన రైలును 130 Kmph వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా, ఈ వేగాన్ని 180 Kmph కు పెంచారు. రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య రైలు దూసుకెళ్లింది. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. కాగా, వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని వెల్లడించారు.
మరికొన్ని నెలల్లోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉండనుండగా.. అందులో థర్ట్ ఏసీకి 10, సెకండ్ ఏసీకి 4, ఫస్ట్ ఏసీకి ఒక బోగీ కేటాయించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే, సీటింగ్‌తో పాటు లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయన్నారు.
Also Read: Allahabad High Court : భార్య హిజాబ్ ధరించలేదని విడాకులు కోరిన భర్త - కోర్టు సంచలన తీర్పు