Allahabad High Court : భార్య హిజాబ్ ధరించలేదని విడాకులు కోరిన భర్త - కోర్టు సంచలన తీర్పు
Allahabad High Court : తన భార్య పర్దా (పర్దా) పాటించకపోవడం మానసిక క్రూరత్వం కారణంగా విడాకులు తీసుకునేందుకు అర్హత పొందుతుందని భర్త చేసిన వాదనను అంగీకరించడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది.
Allahabad High Court : బుర్కా వేసుకోలేదన్న కారణంతో భార్యకు విడాకులు ఇచ్చే హక్కు భర్తకు ఉండదని అలహాబాద్ కోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో భార్య బుర్కా వేసుకోకుండా తనను మానసిక వేధింపులకు గురిచేస్తోందంటూ ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాగైనా విడాకులు మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశాడు. కానీ ఇది మానసిక వేధింపులకు సమానం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. భర్త చేసిన వాదనను అంగీకరించడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది.
అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
ఓ భర్త ( ఇంజినీర్), తన భార్య (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) తనను విడిచిపెట్టి చాలా కాలం క్రితం వెళ్లిపోయిందని, తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సౌమిత్ర దయాల్ సింగ్, జస్టిస్ డొనాది రమేష్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. పలు విషయాలను కీలకంగా పరిశీలించింది. తన భార్య బుర్కా ధరించకుండా మార్కెట్ వంటి ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళుతుందని, పరపురుషులతో తిరుగుతోందని భర్త తరపు న్యాయవాది వాదించారు. తన భర్తను మానసికంగా వేధించడానికే ఆమె ఇలా చేసిందని ఆరోపించారు.
దీనిపై స్పందించిన కోర్టు.. భార్యకు కూడా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు, అధికారాలు ఉన్నాయని చెప్పింది. బుర్కా ధరించకుండా సమాజంలో తిరిగే హక్కు ఆమెకుందని తెలిపింది. వివాహేతర సంబంధం లేదా చట్టాలను, నైతిక విలువలను ఉల్లంఘింస్తేనే మానసికంగా వేధించినట్లు అవుతుందన్న కోర్టు.. దీనిపై భార్యా, భర్తలిద్దరికీ ఒక్కో అభిప్రాయముండొచ్చని తెలిపింది. కానీ వాటిని ఎదుటి వ్యక్తిపై బలవంతంగా రుద్దితే అది మానసిక కృూరత్వం అవుతుందని.. ఇవే ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతాయని చెప్పింది. అయినప్పటికీ వీటిని మానసిక వేధింపులుగా గుర్తించడం కష్టమని కోర్టు తెలిపింది.
వేరొక వ్యక్తితో భార్యకు సంబంధం
ఈ కేసులో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భర్త ఆరోపణలు చేశారే తప్ప నిరూపించేలేదని చెప్పిన ఫ్యామిలీ కోర్టు తీర్పును అలహాబాద్ హై కోర్టు సమర్థించింది. ఓ పంజాబీ బాబాతో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపణలు చేశాడు. కానీ అందుకు సరైన ఆధారాలు కోర్టు ముందు ప్రవేశ పెట్టలేదని చెప్పింది. ఈ సందర్భంగా కోర్టు ఆ భర్తకు కొన్ని సూచనలు చేసింది. భార్య అతన్ని వదిలిపెట్టి చాలా కాలం అవుతుంది.. కాపురం కోసం పిలిచినా రాలేదనే కారణంతో విడాకులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భార్య ఒక ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేస్తోంది. భర్త ఒక ఇంజినీర్.. కాబట్టి ఈ కేసులో భరణం లాంటి కోణం కూడా లేదని తేల్చి చెప్పింది. వారికి పుట్టిన సంతానానికి ఇప్పుడు 29ఏళ్లు. కాబట్టి కస్టడీ సమస్యలు కూడా లేవని కోర్టు వివరించింది.