US Travel Advisory: మహిళలు ఒంటరిగా భారత్ వెళ్లవద్దు, తమ పౌరుల కోసం అమెరికా ట్రావెల్ అడ్వైజరీ విడుదల
India Is Not safe For Woman | అమెరికా భారత్ లోని తమ పౌరులకు లెవెల్-2 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో సూచించింది.

US ravel advisory for India: అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులు, ఉద్యోగుల కోసం లెవెల్-2 ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. భారతదేశంలో నేరాలు, ఉగ్రవాదం సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకుని "ఎక్కువ అప్రమత్తత" అవసరమని అమెరికా పేర్కొంది. ముఖ్యంగా మహిళలు పర్యాటక ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒంటరిగా ప్రయాణించవద్దని అత్యాచారాలు పెరిగిపోతున్నాయని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది. అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల విడుదల చేసిన లెవల్ 2 ట్రావెల్ అడ్వైజరీపై భారత్ మండిపడుతోంది. ఒంటరిగా మహిళలు భారత్ వెళ్లొద్దని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వారిని హెచ్చరించింది.
అత్యాచారాలు, హింస పెరుగుతోందని ఆందోళన
భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారాలు ఒకటిగా మారిందని అమెరికా పేర్కొంది. అదే సమయంలో, పర్యాటక ప్రదేశాలలో లైంగిక హింస, ఇతర తీవ్రమైన నేరాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ పౌరులకు అత్యవసర సేవలను అందించడంలో అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, నేరాలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ మరింత ఆందోళనను వ్యక్తం చేసింది.
ఉగ్రవాద దాడులు, నక్సల్స్ ముప్పు ..
పర్యాటక ప్రదేశాలు, మాల్స్, ప్రభుత్వ భవనాలు, రవాణా కేంద్రాలకు దూరంగా ఉండాలని భారత్ లోని తమ పౌరులకు అమెరికా సూచించింది. ఎందుకంటే అక్కడ ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని పేర్కొంది. భారతదేశం-పాకిస్తాన్ LoC (నియంత్రణ రేఖ) సమీపంలో, కాశ్మీర్‌లోని శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాల్లోనూ హింసకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలుగా లెవల్ 2 అడ్వైజరీలో పేర్కొంది. మావోయిస్టులు, నక్సల్స్ ముప్పు పొంచి ఉంటుంది. బిహార్, జార్ఖండ్, ఒడిశా, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు చురుకుగా ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అమెరికా తమ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్ లాంటి దేశంలో అమెరికా అక్కసు వెళ్లగక్కుతోందని, కేంద్రం పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాకు కేంద్ర ప్రభుత్వం అగ్రతాంబూలం ఇవ్వని కారణంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తుందని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు
అమెరికా ప్రయాణ సలహా (Travel advisory)పై కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళకు రక్షణ పెరిగిందని, ప్రజలు స్వేచ్ఛగా తిరగవచ్చు అని మోదీ సర్కార్ చెబుతుంటే.. అవన్నీ అవాస్తవాలేనని అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీతో తేలిపోయిందని విమర్శలు గుప్పించారు. అమెరికా ప్రకటనను అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టకు నష్టం కలిగించేదిగా కర్ణాటక కాంగ్రెస్ సహా పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. "అమెరికా వాసులకు ప్రయాణ సలహా భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జూన్ 2025 హెచ్చరికలో మహిళలు భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించవద్దని పేర్కొంది. అత్యాచారం, హింస, ఉగ్రవాదం ముప్పు పెరుగుతోంది. ఇది ప్రధాని 'సురక్షిత భారత్' వాదనకు ముగింపు పలుకుతుందా?. అమెరికా తమ పౌరుల కోసం విడుదల చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు అవమానకరం" అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.






















