UPSC Final Result 2021: పేరులోనే కాదు పోరాటంలో కూడా 'శివంగే'- UPSCలో 177వ ర్యాంకర్ కథ విన్నారా?
UPSC Final Result 2021: యూపీఎస్సీలో 177వ ర్యాంక్ సాధించిన శివంగి గోయల్.. పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆమె విజయం వెనుక కథ ఇదే.
UPSC Final Result 2021:
శివంగి గోయల్.. పేరులోనే కాదు జీవితంలో కూడా ఆమె శివంగే. ఉత్తర్‌ప్రదేశ్ హాపుడ్‌లోని పిల్‌కువా పట్టణానికి చెందిన శివంగి.. తన కుటుంబానికే కాకుండా యావత్ జిల్లాకే పేరు తెచ్చింది. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ తుది ఫలితాల్లో ఆల్ ఇండియా 177 ర్యాంక్ సాధించింది. అయితే ఈ విజయం వెనుక ఆమె శ్రమతో పాటు ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఇదే ఆమె కథ
శివంగికి పెళ్లయింది. ఓ కూతురు కూడా ఉంది. అయితే మెట్టినింట్లో భర్త, అత్తమామల వేధింపులను భరించి విసిగిపోయి ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరింది. భర్తతో విడాకుల కేసు నడుస్తోంది. ఇలాంటి సమయంలో పట్టు వదలకుండా సివిల్స్ పరీక్షలు రాసి విజయం సాధించింది.
పెళ్లికి ముందు
పెళ్లికి ముందే శివంగి ఐఏఎస్ కావాలని ప్రయత్నించింది. రెండు సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసి విఫలమైంది. ఆ తర్వాత ఆమెకు పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన నాటి నుంచి గృహ హింసను ఎదుర్కొంది. దీంతో ఆ వేధింపులు భరించలేక తన ఏడేళ్ల కూతుర్ని తీసుకుని తన అమ్మానాన్నల దగ్గరకు వచ్చేసింది.
నాన్న ధైర్యం
తనకు నచ్చింది చేయమని, ఏది అనిపిస్తే అది సాధించమని తన నాన్న ఇచ్చిన ధైర్యంతో శివంగి మళ్లీ సివిల్స్ శిక్షణ ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి తాను కలలు కన్న ఐఏఎస్ ఉద్యోగం కోసం కఠోర శ్రమ చేసింది. స్వతహాగా ప్రిపేర్ అయింది. చివరికి విజయం సాధించింది.
తన విజయానికి అమ్మానాన్న, తన ఏడేళ్ల కూతురే కారణమని శివంగి చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి ఓ వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి.
Also Read: UPSC Civil Services Final Result 2021: UPSC-2021 ఫలితాలు విడుదల- టాప్ ర్యాంకర్ ఎవరో తెలుసా?
Also Read: PM Modi Speech: నేను ప్రధానిని కాదు, 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడిని: మోదీ ఎమోషనల్ స్పీచ్