Yogi Adityanath: జాగ్రత్త పడిన యోగి ఆదిత్యనాథ్- ఊరేగింపులకు ఇక అనుమతి తప్పనిసరి
పలు రాష్ట్రాల్లో మతపరమైన ఘర్షణలు జరుగుతున్నందున ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మత హింసకు సంబంధించిన ఘటనలు పలు రాష్ట్రాల్లో జరుగుతున్నందున మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
కీలక చర్చ
ఈద్, అక్షయ తృతీయ సహా వరుసగా పండుగలు ఉన్న కారణంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల మీద ఉన్నతాధికారుల సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఊరేగింపులకు అనుమతులు తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే లౌడ్‌స్పీకర్ల ఉపయోగం ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఏం జరిగింది?
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. గుజరాత్, బంగాల్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లలో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. గుజరాత్, ఝార్ఖండ్‌లలో ఒకరు చొప్పున మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గుజరాత్
గుజరాత్‌లోని హిమ్మత్ నగర్, ఖాంభాత్ జిల్లాలో ఉద్రిక్తతలు తలెత్తాయి. శ్రీరాముడి ఊరేగింపులో దుండగులు రాళ్లు రువ్వారు. ఐదు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. హింసను అదుపు చేయడానికి పోలీసులు ఏడు రౌండ్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
ఝార్ఖండ్
ఝార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలోనూ శ్రీరాముడి ఊరేగింపులో ఉద్రిక్త ఘటనలు తలెత్తాయి. ఆదివారం హిరాహి-హెంద్లాసో గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న భక్తులపై కొందరు రాళ్లు రువ్వారు. అనంతరం తొక్కిసలాట జరిగింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడం వల్ల.. ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పన్నెండుకు పైగా బైక్‌లు, ఓ పికప్ వ్యాన్‌కు దుండగులు నిప్పంటించారు.
భోగతా గార్డెన్లో రెండు ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. జిల్లా ఎస్పీ, కలెక్టర్.. ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి.. చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం