Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపకపోవడంతో మరో రెండు దేశాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. జపాన్, స్విట్జర్లాండ్.. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపాయి.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ప్రపంచదేశాలు మాత్రం రష్యాపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు పలు ప్రపంచదేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి జపాన్, స్విట్జర్లాండ్ అంగీకరించాయి. ఉక్రెయిన్ పౌరులపై దాడులకు రష్యాను జవాబుదారీగా చేయాలని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద సోమవారం టోక్యోలో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు.
కీలక నిర్ణయం
రష్యా నుంచి బొగ్గు దిగుమతులను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జపాన్ ప్రధాని ఫుమియో కిషిద తెలిపారు. అలాగే, రష్యాకు చెందిన ప్రముఖుల ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రష్యా సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే వస్తువుల ఎగుమతులను కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు.
భీకర యుద్ధం
ఉక్రెయిన్‌లో ఎటు చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడిపోయి ఉండటం ప్రపంచ దేశాలను కలచివేస్తోంది. మరియాపోల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మరియాపోల్‌లో మిగిలిన ఉక్రేనియన్లను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. దీంతో మరియాపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు కనిపిస్తోంది. కానీ, తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఉక్రెయిన్ చెబుతోంది.
సాయం
మరోవైపు రష్యాతో యుద్ధం వేళ ఆర్థికంగా చితికిపోయిన ఉక్రెయిన్‌కు ఐరోపా సమాఖ్య మరింత సాయం ప్రకటించింది. మానవతా సాయం కింద 50 మిలియన్ యూరోలు అందిస్తున్నట్లు తెలిపింది.
Also Read: KGF Chapter 3 : మన రాకీ భాయ్ కన్ను ఈ బంగారపు గనులపై పడితే..?
Also Read: Sri Lanka New Ministers : శ్రీలంకకు కొత్త ఆర్థిక మంత్రి - వెంటనే అప్పు కోసం అమెరికాకు పయనం !