Prashant Kishor Meets Sonia Gandhi: 3 రోజుల్లో రెండు సార్లు సోనియాతో పీకే భేటీ- మిషన్ 2024పై పక్కా ప్లాన్!
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇందుకోసమే ఆయన 3 రోజుల్లో రెండుసార్లు సోనియాతో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వరుసగా భేటీ అవుతున్నారు. సోనియా గాంధీతో సోమవారం భేటీ అయిన ఆయన సుదీర్ఘంగా చర్చించారు. వరుసగా 3 రోజుల్లో రెండోసారి ఆయన భేటీ కావడం విశేషం. గత శనివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పీకే సమావేశమయ్యారు.
లక్ష్యం
2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు మరికొద్ది నెలల్లో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సోనియా గాంధీతో పీకే చర్చించినట్లు సమాచారం. మిషన్ 2024పై పీకే సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని, తమిళనాడు, బంగాల్, మహారాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్‌కు సూచించినట్లు సమాచారం.
పార్టీలోకి
ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు. తమ అభిప్రాయలను ఈ నెలాఖరులోగా వెల్లడించే అవకాశముంది. అయితే కాంగ్రెస్‌లో పీకేను చేరాలని పార్టీ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌కు సేవలు అందించేందుకు పీకే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటికే ఆయన బ్లూప్రింట్ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌కు అప్పగిస్తుందని చెబుతున్నారు.
ఆశలు
ప్రశాంత్ కిశోర్‌కు రాజకీయ ఆశలు ఉన్నాయి. బంగాల్‌లో మమతా బెనర్జీ కోసం పని చేసిన తర్వాత అక్కడ టీఎంసీ విజయం సాధించిన వెంటనే తాను ఇక స్ట్రాటజిస్ట్‌గా పని చేయనని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు. పలుమార్లు చర్చలు కూడా జరిపారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ చనిపోవడంతో ఆయన స్థానంలోకి ప్రశాంత్ కిశోర్ వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ 3 రోజుల్లో ప్రశాంత్ కిశోర్‌తో 2 సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.
Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం
Also Read: KGF Chapter 3 : మన రాకీ భాయ్ కన్ను ఈ బంగారపు గనులపై పడితే..?