UP: చెత్తకుండీలో పసిబిడ్డ - దత్తత తీసుకున్న ఎస్సై దంపతులు, పండుగ వేళ దుర్గమ్మ ఇంటికి వచ్చిందని సంబరం
UP News: యూపీలోని ఘజియాబాద్‌లో ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. బిడ్డ దీనస్థితిని చూసిన ఎస్సై దంపతులు పాపను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.
SI Couple Adopted New Born Girl In UP: ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడతారు. కానీ, కొంతమంది ఇంకా ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. ఇలాంటి ఘటనే యూపీలో (UP) జరిగింది. అప్పుడే పుట్టిన ఆ నవజాత శిశువుకు చెత్త కుప్పే దిక్కైంది. అమ్మఒడిలో హాయిగా సేద తీరాల్సిన ఆ పసిప్రాణం వ్యర్థాల మధ్య అమ్మ కోసం గుక్కపెట్టి ఏడుస్తోంది. ఈ దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అయితే, ఈ ఘటనలో ఓ మానవీయ కోణం సైతం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని (Ghaziabad) పొదల్లో చిన్నారి ఏడుపులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చిన్నారి కుటుంబీకుల కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా వివరాలు తెలియలేదు.
దత్తతకు ముందుకొచ్చిన ఎస్సై దంపతులు
ఈ క్రమంలో చిన్నారి పరిస్థితిని చూసి చలించిన ఎస్సై పుష్పేంద్రసింగ్ దంపతులు ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. తమకు 2018లో వివాహం అయినా ఇప్పటికీ పిల్లలు లేరని.. విజయదశమి రోజున స్వయంగా దుర్గమ్మే చిన్నారి రూపంలో తమ ఇంటికి వచ్చిందని సింగ్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారి దత్తత కోసం ఎస్సై, ఆయన భార్య రాశి చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించారని ఇన్‌స్పెక్టర్ అంకిత్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం శిశువు దంపతుల సంరక్షణలో ఉందన్నారు.
Also Read: Viral News: డ్రైవర్ లేకుండా వెళ్తున్న కారులో మంటలు, షాకింగ్ వీడియో వైరల్