SBI ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తోంది, ఎలక్టోరల్ బాండ్లపై ఎంపీ కపిల్ సిబల్
Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kapil Sibal Comments on Electoral bonds: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Sbi)పై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ (Kapil Sibal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వ్యవహారంలో ఎస్బీఐ ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని రక్షించడమే ఎస్‌బీఐ ఉద్దేశమనే విషయం స్పష్టమవుతోందని, ఆ బ్యాంక్ వ్యవహరిస్తున్న తీరును బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న వేళ జూన్ 30వరకు గడువు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించదని గుర్తు చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై ఎస్బీఐ... సుప్రీం కోర్టు తలుపుతట్టడం సరైన చర్య కాదని ఎంపీ కపిల్ సిబల్ స్పష్టం చేశారు. ఎలక్టోరల్ బాండ్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించిన తర్వాత...ఎస్బీఐ అభ్యర్థనను కోర్టు ఆమోదించడం అంత సులభం కాదన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడిస్తే రాబోయే ఎన్నికల్లో అదే బహిరంగ చర్చకు కారణమవుతుందని, ఆ విషయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా తెలుసని స్పష్టం చేశారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనే సమాచారాన్ని ఇవ్వడానికి సమయం పడుతుందని ఎస్‌బీఐ చెప్పడాన్ని చూస్తే...ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు.
బ్యాంకు అభ్యర్థనను కోర్టు ఆమోదించడం ఈజీ కాదు
ఎలక్టోరల్ బాండ్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత బ్యాంకు అభ్యర్థనను కోర్టు ఆమోదించడం అంత ఈజీ కాదన్నారు. మార్చి 6లోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను...ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు బ్యాంక్ పై చర్యలు తీసుకోవాలని పిల్ దాఖలైంది. దీన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ప్రత్యేకంగా విచారించనుంది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని వెల్లడించడానికి చాలా సమయం పడుతుందని ఎస్‌బీఐ చెప్పడం సరైన చర్య కాదన్నారు. ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఎస్‌బీఐ ప్రయత్నిస్తోందన్నారు కపిల్ సిబల్. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ...జూన్ 30వరకు గడువు ఇవ్వాలని ఎస్బీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించదన్నారు. గడుపు కోరుతూ ఎస్‌బీఐ వేసిన పిటిషన్‌ను సోమవారం విచారించనుంది.
ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా ?
మరోవైపు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాపై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడంతో...కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరపడం ఎన్నికల సంఘం బాధ్యత అన్న ఆయన...పదేళ్లలో ఈసీ కేంద్ర ప్రభుత్వ మరో విభాగంలా తయారైందని ఆరోపించారు. ట్విటర్ లోనూ కపిల్ సిబల్ ఎలక్షన్ కమిషన్ వ్యవహారశైలి ట్వీట్ చేశారు. దారి క్లియరైంది.. కమిషన్ మొత్తం ఎస్ చెప్పే వ్యక్తులతో నింపండి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఇది వర్తిస్తుంది అంటూ కపిల్ సిబల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గత నెలలో ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.