Marital Rape: అత్యాచారం నుంచి వైవాహిక అత్యాచారాన్ని మినహాయించాలనే పిటిషన్లపై విచారణ.. ఢిల్లీ హైకోర్టు ఏమందంటే..
వైవాహిక అత్యాచారాన్ని.. అత్యాచారం నేరం నుంచి మినహాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి)లోని సెక్షన్ 375కు సంబంధించి వైవాహిక అత్యాచారాన్ని.. అత్యాచారం నేరం నుంచి మినహాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వైవాహిక అత్యాచారాన్ని కూడా నేరంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ గతంలో చాలా పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై విచారణ జరుగుతోంది. జస్టిస్ రాజీవ్ శక్దేర్, జస్టిస్ సి.హరి శంకర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై సోమవారం వాదనలు విన్నది. అడ్వకేట్ కరుణ నంది వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా.. పెళ్లైన, పెళ్లి కాని జంటల మధ్య గుణాత్మక వ్యత్యాసం ఉంటుందని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఎందుకంటే వివాహం తర్వాత దాంపత్య సంబంధంపై భార్య, భర్త ఇద్దరికీ చట్టపరమైన హక్కు కూడా ఉంటుందని వ్యాఖ్యానించింది. సెక్షన్ 375లో ఉన్న మినహాయింపులో ఈ గుణాత్మక వ్యత్యాసం కూడా ఒక పాత్ర పోషిస్తుందని తాను ప్రాథమికంగా భావిస్తున్నట్లుగా జస్టిస్ సి.హరి శంకర్ అన్నారు.
‘‘వైవాహిక బంధంలో దాంపత్య బంధాన్ని ఆశించే హక్కు ఇద్దరికీ ఉంటుంది. ఎవరైనా వివాహం చేసుకుంటే వారికి తమ తమ భాగస్వామిపై ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సాధారణ లైంగిక సంబంధం ఒక రకంగా హక్కుగా కూడా ఉంటుంది. అదే పెళ్లి కాని వారిలో ఇది వర్తించదు’’ అని జస్టిస్ సి.హరి శంకర్ అన్నారు. అదే సమయంలో వైవాహిక అత్యాచారానికి శిక్ష విధించాలనే వాస్తవాన్ని కూడా కాదనలేమని జస్టిస్ శంకర్ అభిప్రాయపడ్డారు. సెక్షన్ 375లో అందించిన మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమా అన్నది న్యాయస్థానం ముందున్న సమస్య అని జస్టిస్ శంకర్ వ్యాఖ్యానించారు.
వైవాహిక అత్యాచారం నేరమా కాదా అనే అంశంపై ఇప్పటి వరకు అమెరికా సహా యూకే కోర్టుల్లో దాని చట్టపరమైన స్థితిపై చాలా వాదనలు జరిగాయి. కానీ, భారత్‌కు కొన్ని సాంప్రదాయాలు, సూత్రాలు, సొంత రాజ్యాంగం ఉన్నందున విదేశాల్లోని తీర్పులు ఇక్కడ ఎటువంటి ప్రభావం చూపబోవు అని జస్టిస్ హరి శంకర్ అన్నారు.
Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే
‘‘సెక్షన్ 375లో అత్యాచారం అంటే ఏంటో నిర్వచించిన విధానం ఈ అంశానికి ఒక కారణం కావచ్చు. సెక్షన్ 375 అత్యాచారాన్ని చాలా విస్తృతమైన రీతిలో నిర్వచించింది. ఎదుటి వ్యక్తితో ఇష్టం లేని సెక్స్‌ను రేప్‌గా పిలుస్తారని పేర్కొంది. ఇప్పుడు మనం ఓ ఊహాజనిత పరిస్థితిని ఉదాహరణగా తీసుకుందాం. ఓ కొత్తగా పెళ్లయిన జంట ఉంది. భర్త దాంపత్య సంబంధాలను కోరుకున్నాడు. అందుకు భార్య వద్దు అని చెప్పింది. నువ్వు అనుమతించకపోతే నేను బయటకు వెళ్లిపోతాను. రేపు ఉదయం కలుద్దాం అని భర్త చెప్పాడు. తర్వాత భార్య అందుకు ఒప్పుకుంది. ఈ పరిస్థితిలో మేము మినహాయింపును కొట్టివేస్తే, ఇది అత్యాచారం” అని ఆయన జస్టిస్ హరి శంకర్ అభిప్రాయపడ్డారు. వివాహిత, అవివాహిత జంటల మధ్య అర్థమయ్యే వ్యత్యాసం లేదని పిటిషనర్లు లేవనెత్తిన వాదనతో తాను ఏకీభవించడం లేదని ఆయన అన్నారు.
గతంలో వివాదాస్పద తీర్పు
వైవాహిక అత్యాచారాలపై గతంలో కోర్టులు వివాదాస్పద తీర్పులను ఇచ్చాయి. దీంతో వైవాహిక అత్యాచారాలను నేరంగా పరిగణించాలంటూ మరోసారి సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. భార్యకు ఇష్టం లేకపోయినా భర్త బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనడం నేరం కాదని గత ఏడాది ఆగస్టులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌కే చంద్రవంశీ తీర్పు ఇచ్చారు. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం ఆయన ఈ తీర్పునిచ్చారు. అయితే, వైవాహిక అత్యాచారాన్ని.. అత్యాచారం నేరం నుంచి మినహాయించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read: Hyderabad: కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..
Also Read: ఎమ్మెల్యే రోజా దత్తత గ్రామం ఎక్కడుంది? ఆ ఊరినే ఎందుకు ఎంపిక చేశారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..