Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Crime News: ప.గో జిల్లా నర్సాపురం మండలంలో ఓ వింత దొంగను గ్రామస్థులు పట్టుకున్నారు. గత 6 నెలలుగా మహిళల జాకెట్లను దొంగతన చేస్తోన్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Variety Thief Theft Women Jackets In Narsapuram: సాధారణంగా దొంగలంటే నగలు, డబ్బు దోచుకెళ్లడం చూశాం. లేదా ఖరీదైన వస్తువులను చోరీ చేయడం చూశాం. కానీ ఈ దొంగ మాత్రం మహిళల జాకెట్లు చూస్తే వదిలిపెట్టడు. గత 6 నెలలుగా చోరీ చేస్తూ హల్చల్ చేస్తుండగా.. తాజాగా అనుమానంతో అతన్ని తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో (Narsapuram) ఈ వింత దొంగను గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా నరసాపురం మండలం దర్బరేవు గ్రామంలో గత కొంతకాలంగా వింత దొంగతనాలు జరుగుతున్నాయి. 6 నెలలుగా బాత్రూమ్స్‌ల్లో, ఇంటి బయట ఆరేసిన జాకెట్లు తెల్లవారేసరికి మాయమవుతున్నాయి. దాదాపు అన్ని ఇళ్లల్లోనూ ఇలాగే జరుగుతుండడంతో కోతులు కానీ, ఏవైనా జంతువులు కానీ ఎత్తుకెళ్తున్నాయేమోనని గ్రామస్థులు భావించారు.
అయితే, ప్రతీ రోజూ ఇదే సీన్ రిపీట్ కావడంతో దాదాపు 300కు పైగా జాకెట్లు మాయమయ్యాయి. ఈ క్రమంలో మిస్టరీని ఛేదించాలని భావించిన గ్రామస్థులు నిఘా పెట్టారు. బుధవారం రాత్రి ఓ వ్యక్తి చేతిలో జాకెట్, సంచితో అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని పట్టుకుని నిలదీశారు. సంచిని చెక్ చేయగా దాని నిండా జాకెట్లు కనిపించడంతో ఒక్కసారిగా గ్రామస్థులు షాకయ్యారు. అతనే జాకెట్ల దొంగ అని నిర్థారించుకుని చీవాట్లు పెట్టి పోలీసులకు అప్పగించారు.
'అందుకే చోరీ చేస్తున్నా..'
సదరు నిందితున్ని పోలీసులు విచారిచంగా.. తనది వేములదీవి గ్రామమని.. ఇప్పటివరకూ వందల సంఖ్యలో జాకెట్లు చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఈ జాకెట్లను ఏం చేస్తున్నావని ప్రశ్నించగా.. దగ్గరలోని కాల్వలో పడేశానని చెప్పాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని పోలీసులు అడగ్గా.. అది తన బలహీనత అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి మానసిక రోగి అని భావించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. మళ్లీ ఇలా చెయ్యొద్దని హెచ్చరించారు.