MLA Roja: ఎమ్మెల్యే రోజా దత్తత గ్రామం ఎక్కడుంది? ఆ ఊరినే ఎందుకు ఎంపిక చేశారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..
రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న రోజా సెల్వమణి.. ఓ చిన్నారి లేఖకు చలించి పోయారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించారు.
ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఓ వైపు నియోజకవర్గం, అధికారిక కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటారు. మరోవైపు, జబర్దస్త్ వంటి టీవీ షోల్లోనూ మెరుస్తూ భిన్న రంగాల్లో ఒకేసారి మెరుస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ ఫైర్ బ్రాండ్‌గానూ పేరుపొందారు. ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉన్న ఒక గ్రామానికే అమ్మగా మారారు ఎమ్మెల్యే. ఎన్నో సేవ కార్యక్రమాలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న రోజా సెల్వమణి.. ఓ చిన్నారి లేఖకు చలించి పోయారు. ఏమాత్రం ఆలోచించకుండా ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఒక్కో సమస్యను తన సమస్యగా తీసుకోని తీర్చేస్తున్నారు రోజా. అసలింతకీ రోజా తీసుకున్న దత్తత గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామం పరిస్థితి ఏంటి?
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని మీరాసాహెబ్ పాలెం ఓ మారుమూల గ్రామం. రెక్క ఆడితే గానీ డొక్క ఆడని జీవితాలు వారివి.. వంద ముస్లీం కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తూ కాయా కష్టం చేసుకుని బతుకుతున్నారు. మారుమూల గ్రామం కావడంతో ఏ అధికారి, ఏ ప్రజాప్రతినిధి గానీ పెద్దగా పట్టించుకునే వారు కాదు.. దీంతో ఆ గ్రామంలో సమస్యలు రోజు రోజుకి అధికంగా మారాయి. గ్రామంలో వీధి దీపాలు మొదలుకుని, మరుగుదొడ్ల వరకూ ఏవీ లేవు. సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధ ఏమీ పెద్దగా లేవు. నివసించే ఇళ్ళు కూడా అధికంగా పూరి గుడిసెలే.
ఇలాంటి పరిస్ధితుల్లో ఆ గ్రామస్తులు తాగేందుకు కూడా నీరు లేకపోవడంతో తమ గోడు ఎమ్మెల్యే రోజాకి విన్నవించుకున్నారు. దీంతో ఆ గ్రామానికి చేరుకున్న రోజా మంచి నీటి కోసం బోర్లు వేయించారు. కానీ, నీళ్ళు రాకపోవడంతో ఒకదాని తరువాత ఒకటి దాదాపు ఎనిమిది బోర్లను సొంత నిధులతో వేయించారు. అలా ఓ రోజు ఆ గ్రామంలో ప్రజలతో కలిసి రోజా అక్కడ నిద్ర చేశారు. ఇలా ఉండగా ఓ రోజు ఆ గ్రామంలో ఓ చిన్నారికి వచ్చిన ఆలోచన ఆ గ్రామం రూపురేఖలే మార్చేసింది. ఏడో తరగతి చదువుతున్న తహాసీన్ అనే చిన్నారి ఎమ్మెల్యే రోజాకి లేఖ రాసింది. ఆ చిన్నారి లేఖను చూసి చలించి పోయిన రోజా వేంటనే గ్రామానికి చేరుకుని తహాసీన్‌ను అభినందించి ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఆ గ్రామం కోసం రోజా సొంత నిధులతో ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గత ఏడాది డిసెంబరు 21న సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మీరా సాహేబ్ పాలెంని దత్తత తీసుకున్న రోజా ఆ గ్రామంలో విద్యుత్ దీపాలు వేయించి, ఆ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించేలా చేశారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సొంత నిధులతో వారికి వైద్య సేవలు అందించేందుకు రోజా కృషి చేస్తున్నారు. గ్రామంలో ఇళ్ళు లేని వారికి ఇళ్ళ మంజూరు, ఇళ్ళ పట్టాలు మంజూరు చేసేందుకు రోజా చర్యలు చేపడుతున్నారు. ఆ గ్రామంలోని ప్రజలు శుభకార్యం చేసుకునేందుకు ఓ మండపాన్ని కూడా గ్రామ సమీపంలో నిర్మించేందుకు స్థల పరిశీలన జరిగింది.
సంవత్సరం లోపు మీరాసాహేబ్ పాలెం గ్రామాన్ని నగరి నియోజకవర్గంలోనే ఒక అద్భుతమైన గ్రామంగా తీర్చి దిద్దుతాంమని రోజా హామీ ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం తనకు ఎంత గానో తృప్తిని ఇచ్చిందని ఆమె అంటున్నారు.
Also Read: నెల్లూరులో నయా ట్రెండ్.. ఈ హాట్ చిక్ టేస్ట్ చేస్తే మైమరచిపోవాల్సిందే.. వంట కూడా స్కూటర్ మీదే..
Also Read: TDP One Side Love : ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?