Delhi Ordinance Bill: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్‌లో కీలక మార్పులు, కొత్త ప్రొవిజన్ చేర్చిన కేంద్రం!
Delhi Ordinance Bill: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్‌లో కేంద్రం కీలక మార్పులు చేసింది.
Delhi Ordinance Bill:
ఆప్ వర్సెస్ బీజేపీ..
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్‌పై పార్లమెంట్‌లో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు చెప్పినా...ఆ తీర్పుని ధిక్కరించి మరీ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై మండి పడుతోంది ఆప్. కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇవాళే (జులై 31) పార్లమెంట్‌లో ఈ బిల్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా అది వాయిదా పడింది. ఇందుకు ప్రధాన కారణం...ఆ బిల్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం. ఇప్పటికే ఇది వివాదాస్పదం అవడం వల్ల కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ మార్పులు చేసిన తరవాతే పార్లమెంట్‌లో బిల్‌ని ప్రవేశపెట్టనుంది మోదీ సర్కార్. కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఈ బిల్‌ని ప్రవేశపెడతారు. ఈ బిల్‌లో మూడు కీలకమైన అంశాలను తొలగించి ఓ రూల్‌ని జోడించనున్నట్టు తెలుస్తోంది. ఇకపై దీన్ని Government of National Capital Territory of Delhi (Amendment) Billగా పిలవనున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ఈ ఆర్డినెన్స్‌ని తయారు చేసినప్పటికీ సుప్రీంకోర్టు మందలించడం వల్ల వాయిదా పడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అధికారుల బదిలీ, నియామకాలపై పూర్తి అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయని తేల్చి చెప్పింది. అయినా కేంద్రం ఈ విషయంలో పట్టు విడవడం లేదు.
ఏం మారింది..?
స్టేట్ పబ్లిక్ సర్వీస్‌లతో పాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బిల్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే..ఇప్పుడీ బిల్‌ని పక్కన పెట్టి సంస్కరిస్తున్నారు. ఇందులోని కొత్త ప్రొవిజన్ ప్రకారం...ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వంలో నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ (National Capital Civil Service Authority) ఏర్పాటవుతుంది. ఈ అథారిటీ సూచనల ఆధారంగానే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సర్వీస్ కమిషన్‌లలో నియామకాలకు అనుమతినిస్తారు. ముఖ్యమంత్రి అన్న మాటే కానీ తనకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయని, అంతా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటోందని కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆయన కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆప్, బీజేపీ మధ్య వైరాన్ని మరింత పెంచింది ఈ బిల్. ఢిల్లీలోని అధికారులందరినీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది ఆప్. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిశారు. తమకు మద్దతునివ్వాలని కోరారు. ఈ విషయంలో తీర్పుని రివ్యూ చేయాలని కేంద్రం సుప్రీంకోర్టుని కోరింది.
ఢిల్లీ పాలనా వ్యవహారాలపై ఇటీవలే సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రభుత్వ అధికారాలకు లోబడి పని చేయాలని తేల్చి చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పుని ధర్మాసనం తోసి పుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉండాలని వెల్లడించింది. శాసన, కార్యనిర్వాహక అధికారాలు ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది. అయితే..పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ వ్యవహారాల్లో మాత్రం ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలన్న నిబంధన వర్తించదని తెలిపింది. మిగతా అన్ని వ్యవహారాల్లోనూ ఢిల్లీ ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు తేల్చి చెప్పింది.
Also Read: మణిపూర్ హింసపై సిట్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ, మైతేయిల పిటిషన్‌ని తిరస్కరించిన ధర్మాసనం