మణిపూర్ హింసపై సిట్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ, మైతేయిల పిటిషన్‌ని తిరస్కరించిన ధర్మాసనం
Manipur Violence: మణిపూర్ హింసపై సిట్ విచారణ చేపట్టాలన్న మైతేయిల పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Manipur Violence:
పిటిషన్ తిరస్కరణ..
మణిపూర్ హింసాకాండపై సిట్‌ని ఏర్పాటు చేసి విచారించాలన్న మైతేయిల పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం ఓ వర్గాన్ని దోషిగా చూపించే పిటిషన్‌లను విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ అల్లర్లతో పాటు నార్కో టెర్రరిజం, గసగసాల సాగుపైనా విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు మైతేయి తరపున పిటిషన్ వేసిన న్యాయవాది. అయితే సుప్రీంకోర్టు మాత్రం మరింత కచ్చితమైన అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించాలని, కేవలం ఓ కమ్యూనిటీని తప్పుపట్టడం సరికాదని స్పష్టం చేసింది. మైతేయిల తరపున పిటిషన్ వేసిన సీనియర్ అడ్వకేట్ మాధవి దివాన్‌ని...ఉపసంహరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ పిటిషన్‌లో సీమాంతర ఉగ్రవాదం గురించీ ప్రస్తావించారు. అంతే కాదు. గసగసాల సాగు కారణంగానే ఈ అల్లర్లు మొదలయ్యాయనీ అందులో తెలిపారు. ఇందులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, NIA,NHRCలనూ పిటిషనర్‌లుగా పేర్కొన్నారు.
గవర్నర్‌తో ఇండియా ఎంపీల భేటీ..
మణిపూర్ పర్యటనలో భాగంగా విపక్ష ఎంపీలు గవర్నర్ అనుసూయ ఉయ్‌కీని కలిశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురావాలని మెమొరాండం ఇచ్చారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఏదో ఓ పరిష్కారం చూపించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ అనుసూయను కోరారు. మెమొరాండంపై 21 మంది ఎంపీలు సంతకాలు చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీస్‌లను బంద్ చేయడమూ ఎన్నో అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
"మణిపూర్‌లో గత 89 రోజులుగా శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా పరిష్కారం చూపించేలా మీరు చొరవ చూపించండి. రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా చూడండి. ఇళ్లు కోల్పోయిన వాళ్లు పునరావాసం కల్పించాలి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వడంలో పూర్తిగా విఫలమైపోయింది. బాధితులకు న్యాయం చేయడంలో అన్ని విధాలుగా చర్యలు తీసుకోండి. "
- విపక్ష ఎంపీల మెమొరాండం
వేలాది మంది వలస...
మణిపూర్‌లో హింసను తట్టుకోలేక చాలా మంది రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారు. పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మిజోరంకి వేలాది మంది వలస వెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే 5 వేల మంది కుకీలు భయంతో మణిపూర్‌ని వదిలి నాగాలాండ్‌కి వెళ్లారు. అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అయితే...అక్కడ ప్రత్యేకంగా వీళ్ల కోసం అంటూ రిలీఫ్ క్యాంప్‌లు ఏమీ లేవు. ఫలితంగా...ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో తలదాచుకుంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిలో చంటిబిడ్డల తల్లులూ ఉన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలను తలుచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నారు. విద్యార్థుల పరిస్థితైతే మరీ దారుణంగా ఉంది. ఉన్నట్టుండి అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడులు మొదలయ్యాయని, అప్పటికప్పుడు అన్నీ వదిలేసి నాగాలాండ్‌కి వచ్చామని వివరిస్తున్నారు. చదువుకోడానికి వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Also Read: ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారు? మణిపూర్ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు