ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారు? మణిపూర్ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Manipur Violence: మణిపూర్‌లో హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Manipur Violence:
సుప్రీంకోర్టు విచారణ..
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బాధిత మహిళల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించగా..కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వాదించారు. ఈ కేసుని సీబీఐ విచారించాలన్న కేంద్రం అభిప్రాయాన్ని బాధితులు అంగీకరించడం లేదని కపిల్ సిబాల్ కోర్టుకి వెల్లడించారు. అదే సమయంలో అసోం రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలన్న విషయంలోనూ వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ స్పందించారు. అసోంకి కేసుని బదిలీ చేయాలని తాము చెప్పలేదని, కేవలం వేరే రాష్ట్రం అని మాత్రమే ప్రస్తావించామని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారో చెప్పాలని ఆదేశించింది. అసలు ఈ వీడియో బయటకు వచ్చేంత వరకూ ఏం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది. వీడియో బయటకు వచ్చి 14 రోజులవుతోందని, ఇప్పటి వరకూ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తిస్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించింది.
సీబీఐ విచారణను వ్యతిరేకించిన కపిల్ సిబల్...అసోంకి కాకుండా వేరే రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో ఎంతో మంది కనిపించకుండా పోయారని వెల్లడించారు. అక్కడ లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. ఇక్కడ శాంతిభద్రతలు నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అసహనం వ్యక్తం చేశారు కపిల్ సిబల్. రిలీఫ్ క్యాంప్‌లు కూడా దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. బాధితులు పదేపదే కోర్టుకు రాలేరని, విచారణకు ప్రత్యామ్నాయ మార్గమేదైనా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు.
CJI DY Chandrachud asks about how many such FIRs have been filed since May 3, when the violence in Manipur started. https://t.co/7YAd8OOMO4
— ANI (@ANI) July 31, 2023
Manipur viral video case | Senior advocate Kapil Sibal appearing for the two victim women from Manipur, says the women are against the CBI probe into the case and transfer of case to Assam.
— ANI (@ANI) July 31, 2023
Solicitor General Tushar Mehta, appearing for government, says we have never requested… pic.twitter.com/mOdLgd0Crc
ఈ విచారణ సమయంలోనే ఓ న్యాయవాది బెంగాల్, రాజస్థాన్లో మహిళలపై జరిగిన దాడులనూ ప్రస్తావించారు. అక్కడ కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని గుర్తు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. అయితే...అక్కడి ఘటనల్ని మణిపూర్ హింసతో పోల్చి చూడలేమని వ్యాఖ్యానించారు."దేశవ్యాప్తంగా మహిళలపై దారుణాలు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే వాస్తవం కూడా. కానీ...మనం ఇప్పుడు విచారిస్తున్న కేసు పూర్తిగా విభిన్నం. ఓ తెగకు చెందిన మహిళను అత్యంత దారుణంగా అవమానించారు. అన్ని చోట్లా జరుగుతోంది ఇదే కదా అని తేల్చి చెప్పలేం. అయితే మహిళలందరినీ రక్షించండి లేదంటే...పూర్తిగా వదిలేయండి అని చెబుతున్నారా..?"
- డీవై చంద్రచూడ్, సీజేఐ