(Source: ECI | ABP NEWS)
India Canada Relations: కెనడాలో ఉన్న భారతీయులు సురక్షితం కాదు.. పరిస్థితి క్రమంగా మారుతోందన్న భారత రాయబారి
Indians in Canada | భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ కెనడాలో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాతో సంబంధాలు మెరుగుపర్చినందుకు కొత్త ప్రధాని కార్నీని ప్రశంసించారు.

న్యూఢిల్లీ: కెనడాలో ఉన్న భారతీయ పౌరుల భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. అక్కడ భారతీయులు సేఫ్ కాదని కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ కె పట్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏర్పడిన రాజకీయ ఒత్తిడి, ఖలీస్థానీ తీవ్రవాదుల కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ కృషి చేశారని దినేష్ పట్నాయక్ అన్నారు.
CTV న్యూస్‌తో దినేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. కెనడా వంటి దేశంలో హైకమిషనర్‌కు భద్రత అవసరం కావడం అసాధారణం అని పట్నాయక్ అన్నారు. కెనడా ఈ పరిస్థితిని భారత సమస్యగా చూడకూడదు. ఇది కెనడా వాసుల సమస్య. ఈ సమస్యను సృష్టిస్తున్నది కెనడియన్లేనని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత పౌరులు అక్కడ సురక్షితంగా లేరని పట్నాయక్ అన్నారు.
ఖలీస్తాన్ అనుకూల తీవ్రవాద గ్రూపుల గురించి నేరుగా ప్రస్తావించకుండా, రాయబారి పట్నాయక్ మాట్లాడారు. "ఒక సమూహం నిజంగా భయభ్రాంతులకు గురిచేస్తుంది. సంబంధాన్ని బంధీలుగా ఉంచుతున్న భద్రతా పరిస్థితులు ఉన్నాయి. వారితో ఎలా వ్యవహరించాలి? లా అండ్ ఆర్డర్ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?" అని ప్రశ్నలు లేవనెత్తారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కెనడాను విడిచిపెట్టి వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. భారత సమాజానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ఘటనలు పెరగడానికి కారణాలను విశ్లేషించాలని గుర్తుచేశారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీకి రాయబారి పట్నాయక్ కృతజ్ఞతలు
అదే ఇంటర్వ్యూలో భారత రాయబారి దినేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటిష్ కొలంబియాలో సిక్కు వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని ఆరోపించినప్పటి నుంచి న్యూఢిల్లీ, ఒట్టావా మధ్య సంబంధాలు క్షీణించాయని పట్నాయక్ ఒప్పుకున్నారు. ట్రూడో చేసిన ఆరోపణలను "అసంబద్ధమైనవి, హాస్యాస్పదం అంటూ" కొట్టిపారేశారు. ట్రూడో వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. "మనకు కావాల్సింది పరస్పర సంభాషణ, సాక్ష్యాలు లేకుండా మీడియాలో ఆరోపణలు చేయడం కాదు" అని పట్నాయక్ అన్నారు.
భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మార్చినందుకు ఒట్టావాలోని కొత్త నాయకత్వాన్ని రాయబారి ప్రశంసించారు. "మేం కొంచెం ముందు లేదా తరువాత కావొచ్చు. కానీ రెండు పెద్ద దేశాలను ఎక్కువ కాలం వేరుగా ఉంచలేరు" అన్నారు. "హైకమిషన్ పునరుద్ధరణ అనివార్యం, అందుకు కొంత సమయం పట్టింది. కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ విషయాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి కీలకపాత్ర పోషించారు" అన్నారు.
సంబంధాలు మరింత మెరుగ్గా ఉండవచ్చు: రాయబారి పట్నాయక్
పట్నాయక్ ప్రకారం.. భారత్, కెనడా దేశాలు ఇప్పుడు నమ్మకాన్ని పునర్నిర్మించే దశలో ఉన్నాయి. భద్రతా సంస్థలు ఒకరితో ఒకరు చర్చిస్తున్నారు. RCMP, NIA మధ్య చర్చలు జరుగుతున్నాయి. మా NSAలు ఇద్దరూ కలిశారు. సంబంధాన్ని పునర్నిర్మించే ప్రక్రియ కొనసాగుతోంది" ఆయన అన్నారు. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన G7 సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రధాని మోదీకి కార్నీ ఆహ్వానించిన తరువాత, భారతదేశం, కెనడా మంత్రుల స్థాయి చర్చలను పునరుద్ధరించాయి. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఇటీవల భారతదేశంలో పర్యటించారు. వాణిజ్యం, భద్రతలో సహకారాన్ని విస్తరించాలని ఉద్దేశించినట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై భారత్ ఆందోళన
భారత్, కెనడాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న, భారత్ నిషేధించిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా గురించి పట్నాయక్ ప్రస్తావించారు. సరిహద్దు దాటి జరిగే నేర కార్యకలాపాలను పరిష్కరించడానికి బలమైన అంతర్గత భద్రతా సహకారం అవసరమన్నారు. భారత్ ఇప్పుడు కెనడాను "నమ్మదగిన భాగస్వామి"గా పరిగణిస్తుందా అన ప్రశ్నకు "ఇంకా లేదు" అని సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో పరిస్థితులో మార్పు వస్తుందన్నారు. ఇతర అంశాలు ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించకూడదు" అని అన్నారు.






















