Narendra Modi on Nara Lokesh: నారా లోకేష్‌పై ప్రధానిమోదీ అమితమైన అభిమానం… ఫ్యూచర్ లీడర్ అని లోకేషే క్లారిటీ ఇస్తున్నారా..?
చంద్రబాబు తర్వాత ఎవరు..? ఈ ప్రశ్నకు టీడీపీలో అయితే ఆన్సర్ వెంటనే వస్తుంది నారా లోకేష్ అని..! మరి కూటమి ప్రభుత్వంలో ఎవరంటే.. చెప్పడం కొంచం కష్టం.. అయితే ఆ కష్టాన్ని ప్రధాని మోదీ ఈజీ చేస్తున్నారా.. ?

PM Modi on Nara Lokesh: 2019- కర్నూలు ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోదీ:
“ఏపీలో ఎన్నికలు కొత్త 'సన్‌రైజ్'ను తీసుకురావచ్చు, కానీ 'సన్ సెట్' కూడా జరుగుతుంది" అని మోదీ చంద్రబాబు, లోకేష్‌లను ఉద్దేశించి విమర్శించారు. ఇక్కడ సన్‌సెట్ అంటే నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఆ ఎన్నికలతో ముగిసిపోతుందన్నది మోదీ మాటల అంతరార్థం అదే నరేంద్రమోదీ .. అదే కర్నూలులో ఇప్పుడు ప్రధానిగా అధికారిక హోదాలో నారా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అవసరానికి మించి ఎలివేషన్ ఇస్తున్నారు. చిన్నబాబుతో ప్రత్యేక సమావేశాలు.. ఆయన్ను ప్రత్యేకంగా పొగడటాలు.. ట్వీట్‌లలో ప్రత్యేక ప్రస్తావనలు..వీటన్నింటి ద్వారా ప్రధాని మోదీ నారా లోకేష్ ఫ్యూచర్ లీడర్ అన్న సంకేతాలు ఇస్తున్నారా..?
చంద్రబాబు తర్వాత ఎవరు…?
ప్రస్తుతానికి ఇది అప్రస్తుతమే కానీ… ఓ చర్చ అయితే పార్టీలో నడుస్తుంటుంది కదా.. టీడీపీలో అయితే దీనిపై పెద్దగా ఆలోచించడానికేం ఉండదు.. చంద్రబాబు తర్వాత లోకేషే.. ! అయితే పార్టీలో పొజిషన్ కాకుండా.. ప్రభుత్వంలో పొజిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికి ఆన్సర్ చెప్పడం అంత సులభం కాదు. పైగా చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నంత కాలం ఆయన నాయకత్వమే ఉండే అవకాశం ఉంటుంది. ఏపీలో బీజేపీ మైనర్ పార్టీ కాబట్టి.. ఈ కూటమిలో కీలకంగా ఉన్న జనసేన, బాగా పాపులారిటీ ఉన్న జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా లోకేష్ కు పోటీదారు అవుతారు. అయితే ఈ డిస్కషన్ రాకుండా చేసేందుకు రెండు పార్టీల నేతలు ఈ చర్చను రానివ్వరు. పైగా పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంలో ఇంకో 15 ఏళ్లు ఉండాలని పలు సందర్బాల్లో చెప్పారు. లోకేష్ కూడా తన రాజకీయ భవితవ్యంపై చర్చ రాకుండా జాగ్రత్త పడతారు..
పవన్‌కూ ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని
ఓ సారి కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగిన విషయాన్ని గుర్తుచేసుకుంటే.. అప్పట్లో పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుంది. ప్రమాణ స్వీకార వేదికపై పవన్‌ను ప్రత్యేకంగా పక్కకు పిలవడం… ఆ తర్వాత అమరావతి 2.0 కార్యక్రమంలోనూ పవన్ కు ప్రాధాన్యత ఇవ్వడం… మరో సందర్భంలో ఆయన్ను పెనుగాలిగా అభివర్ణించారు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ పట్ల ఆ ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో లోకేష్ ఢిల్లీ స్థాయిలో రైజ్ అయ్యారు.

పెరిగిన లోకేష్ హవా… ఇంటికి పిలిచిన ప్రధాని
కూటమిలో కీలకంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం లోకేష్ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసేవారు. అయితే విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం తర్వాత లోకేష్ రేంజ్ పెరిగింది. గిన్నీస్ రికార్డ్ స్థాయిలో దాని నిర్వహణ విషయంలో లోకేష్ చూపిన చొరవను ప్రధాని గుర్తించారు. వేదిక మీదనే ప్రత్యేక స్థానాన్నిచ్చారు. ఆ తర్వాత వచ్చి తనను కలవాలంటూ పిలిచారు. ప్రధాని ఆహ్వానం మేరకు లోకేష్ కుటుంబంతో సహా వెళ్లి మోదీని కలిశారు. ఆయనతో కలిసి దాదాపు గంటన్నర సేపు డిన్నర్ మీటింగ్ చేశారు. అప్పటి నుంచే మోదీతో లోకేష్ అటాచ్‌మెంట్ పెరిగింది. ఆ తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లడం కూడా పెరిగింది. చాలామంది కేంద్రమంత్రులను తరుచూ కలుస్తున్నారు. గుగూల్ ను విశాఖకు రప్పించడంతో ఆయన ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. ప్రధాని సహకారం లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. యోగాంధ్ర సక్సెస్ గురించి ఆయన కేంద్ర కేబినెట్‌లో మాట్లాడారు. నిన్న కర్నూల్ పర్యటన తర్వాత.. ట్వీట్ చేసిన ప్రధానమంత్రి… ప్రత్యేకంగా లోకేష్‌ను మెన్షన్ చేశారు. దీనిని బట్టే ఆ ట్వీట్‌కు ఉన్న ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పడానికి లోకేష్ ఏమీ ముఖ్యమంత్రి కాదు కదా… లోకేష్‌కు ఆ స్థాయి ఎలివేషన్ ఇవ్వడానికి ప్రధానికున్న ప్రధానమైన కారణం ఏంటి.

లోకేష్‌కు పెరిగిన పరపతి..
ఈ ఎన్నికల్లో అప్రతిహత విజయంతో కూటమి ఏపీలో తిరుగులేని స్థానంలో ఉంది కానీ.. 2019కి ముందు పరిస్థితి వేరు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీతో సహా.. బీజేపీ మొత్తం లోకేష్‌ను కూడా టార్గెట్ చేసింది. అంటే 2019కి ముందు నారా లోకేష్ పై ప్రధాని మోదీకి తీవ్రమైన వ్యతిరేకత భావం ఉంది. వారసత్వంగా వచ్చి ప్రజలపై పెత్తనం చేయాలనుకుంటున్నారని భావనకు వచ్చారు. సమర్థత ఉన్న వారసులను ప్రోత్సహించడానికి మోదీ వెనుకాడరు. కానీ ప్రజలపై బలవంతంగా రుద్దితేనే వ్యతిరేకిస్తున్నారు. లోకేష్ విషయంలో అప్పట్లో ఆయన అదే ఫీల్ అయ్యారని ప్రచారసభల్లోని మాటలను బట్టి అర్థమైపోతుంది.
ఆ తర్వాత ఐదేళ్లకు పరిస్థితులు మారాయి. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ కూటమి కట్టడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపారని.. బీజేపీని టీడీపీని కలపడానికి తన వంతు కృషి చేశారని జనసేన నేతలు .. పవన్ కల్యాణ్ కూడా చెబుతుంటారు. దానికి తగ్గట్లుగా ప్రధాని ఆయనకు ప్రాధాన్యం కూడా ఇచ్చారు.
“రాష్ట్రవ్యాప్తంగా ‘సూపర్ జీఎస్టీ , సూపర్ సేవింగ్స్’ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సృజనాత్మక పోటీల ద్వారా, యువతలో జీఎస్టీ పట్ల అవగాహన పెంచగలిగారు..” అని అభినందించారు. ప్రత్యేకంగా ట్వీట్ కూడా చేశారు. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ .. నారా లోకేష్ పై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. వ్యక్తిగత అంశాలపైనా సలహాలు ఇస్తున్నారు. కర్నూలులో హెలికాఫ్టర్ వద్ద ఆహ్వానం పలికినప్పుడు బాగా బరువు తగ్గావు అని లోకేష్‌ను అభినందించారు. లోకేష్ పై ప్రధాని మోదీ.. కూటమిలో పార్టీ నేత అయినందునే అభిమానం చూపిస్తున్నారని అనుకోలేము. వారసుడు అనే వ్యతిరేకతను మోదీ తుడిచేసుకున్నారని ఆయన సామర్థ్యాన్ని గుర్తించారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వాన్ని అన్ని రకలుగా మోదీ గుర్తిస్తున్నారా అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జరుగుతన్న సంఘటనలు దానిని బలపరుస్తున్నాయి కూడా.,!
అయితే ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా చూడాలి. పొత్తులతో పార్టీలను నడుపుతున్నప్పుడు.. మిత్రుల మనోభావాలను పట్టించుకోవాలి. పవన్ కల్యాణ్ నిర్ద్వందంగా చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఇంకో 15 ఏళ్లైనా ఆయన నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధమే అన్నట్లు మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ అలా అంటున్నారుని కానీ.. ఆయన పార్టీ క్యాడర్ మాత్రం ఆయన్ను ఎప్పుడు సీఎంగా చూద్దామా అన్న ఆతృతలో ఉంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వారికి నచ్చడం లేదు కూడా .. ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా చూస్తే.. పవన్ చంద్రబాబు నాయకత్వాన్ని అన్నారు కానీ.. టీడీపీ నాయకత్వం అనలేదు. అంటే టీడీపీలో ఎవరైనా అని చెప్పలేదు. అదే సమయంలో లోకేష్‌పైన వ్యతిరేకత కూడా వ్యక్తం చేయలేదు. ఆయనతో చాలా సోదర, సుహృద్భావ రిలేషన్‌ను కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. మరికొన్ని మంత్రిత్వ శాఖలను లోకేష్ నిర్వహించగలరు అని చెప్పడం ద్వారా ఆయన కూడా లోకేష్‌కు ఎలివేషన్ ఇస్తున్నట్లే అనుకోవచ్చు. ప్రస్తుతానికి అమరావతి, పోలవరం, విశాఖ ఆర్థిక రాజధాని, రాయలసీమ ఇండస్ట్రియల్ కేపిటల్ అనే స్పష్టమైన ఫోకస్‌తో కూటమి నడుస్తోంది. చంద్రబాబు నాయకత్వం విషయంలో కూటమిలో వాళ్లకు ఇసుమంతైనా వ్యతిరేకత లేదు. కాకపోతే.. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు.. ప్రధాని స్థాయి వాళ్లు స్పందనలు లోకేష్ ప్రాధాన్యతను పెంచాయి. అందుకే ఆయన ఫ్యూచర్ లీడర్ అనే చర్చకు దారితీశాయి.





















