How much alcohol is unsafe : మద్యం తాగడం అందరికీ హానికరం కాదు కానీ షరతులు వర్తిస్తాయి ! ఇవిగో ఆశ్చర్యపోయే వాస్తవాలు
మద్యం ఆరోగ్యానికి హానికరం అని మాత్రమే మన దేశంలో ప్రచారం చేస్తారు. ఎందుకంటే మద్యాన్ని తాగే పద్దతి ఇక్కడ అలాగే ఉంటుంది. నిజానికి లిక్కర్‌తో వైద్య ప్రయోజనాలు ఉంటాయి . ఆ పూర్తి వివరాలు ఇవీ
How much alcohol is unsafe : మద్య నిషేదం ఉన్న సమయంలో మెడికల్ పర్మిట్స్ మీద కొంత మద్యం తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రొహిబిషన్ అమల్లో ఉన్న బీహార్‌లోనూ ఈ పద్దతి ఉంది. మెడికల్ పర్మిట్స్ ఇవ్వడానికి అదేమైనా మెడిసినా అనే డౌట్ రావొచ్చు. నిజంగానే అది మెడిసినే. కానీ అందరికీ కాదు. 40 ఏళ్ల వయసు దాటినవారు స్వల్పంగా ఆల్కహాల్ తీసుకోవటం ఆరోగ్యానికి లాభిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
40 ఏళ్లలోపు వారు మద్యం తాగితే ప్రమాదమే !
40 ఏళ్లు దాటిన వారు రెడ్ వైన్ పరిమితంగా సేవిస్తే గుండె జబ్బులు, గుండెపోటు, షుగర్ లెవల్స్ వంటి హెల్త్ రిస్కులు తగ్గుతాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలిపింది. అయితే మద్యం పరిమితంగా తాగడం వల్ల వచ్చే ప్రయోజనం 40 ఏళ్లు పైబడిన వారికే ఉంటుంది. 39 ఏళ్ల లోపువారు మందుకొడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనమూ ఉండదని, పైగా అనారోగ్యానికి గురవుతారని లాన్సెట్ తెలిపింది.
పెరుగుతున్న మద్యం తాగే మహిళల సంఖ్య !
మన దేశంలో గత 30 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం పెరిగింది. దేశంలో 15 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న దాదాపు 54 లక్షల మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది. 1990లతో పోల్చితే ఇప్పుడు 0.08 శాతం పెరిగింది. 40-64 ఏజ్ గ్రూప్ ఆడవాళ్లలో ఈ హ్యాబిట్ 0.15 శాతం పెరిగింది. 65 ఏళ్లు పైబడ్డ మహిళలు మద్యం తాగటం తగ్గించారని లాన్సెట్ మెటా అనాలసిస్ స్పష్టం చేసింది.
మద్యానికి బానిసలవుతున్న మగవాళ్లు !
మగవాళ్లలో అన్ని వయసులవారిలోనూ డ్రింకింగ్ అలవాటు పెరిగింది. 0-64 ఏజ్ గ్రూపులో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ వయసువాళ్లల్లో 5.63 శాతం, 15-39 ఏజ్ గ్రూప్‌లో 5.24 శాతం మద్యం అలవాటు పెరగ్గా 65 ఏళ్లు పైబడ్డవారిలో 2.88 శాతం పెరిగింది. దాదాపు 204 దేశాల నుంచి మందుబాబుల వివరాలపై అధ్యయనం చేసి ఈ వివరాలు తెలిపారు. 15 నుంచి 39 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారే అధిక మోతాదులో మద్యం తాగుతున్నట్లు గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు.
అంతిమంగా లాన్సెట్ సర్వే ఏం చెబుతోందంటే.. పరిమితంగా రెండు,మూడు పెగ్గులురెడ్ వైన్ ను 40 ఏళ్లు దాటిన వారు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇతరులు తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటే మేలు.