Football Coach: బాలికను వేధించిన ఫుట్‌బాల్ కోచ్ - 2019 నాటి కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష
Football Coach: బాలికను వేధించిన ఫుట్‌బాల్ కోచ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా విధించింది పోక్సో కోర్టు
Football Coach: రాజస్థాన్ అజ్మీర్ లోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికను వేధించిన ఓ ఫుట్‌బాల్ కోచ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా విధించింది. ఈ సంఘటన 2019 లో అజ్మీర్ లో జరిగింది. అయితే బాధిత బాలిక హిమాచల్ ప్రదేశ్ కసోల్ లోని తన పాఠశాలలో అధికారులకు ఈ విషయాన్ని రెండోళ్ల తర్వాత చెప్పింది. బాలికపై వేధింపులు జరిగినప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లలోపే అని అధికారులు తెలిపారు.
2019 లో అజ్మీర్ లో అండర్ -16 ఫుట్‌బాల్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు రాజస్థాన్ కు వచ్చింది బాలిక. ఆ సమయంలో ఫుట్‌బాల్ కోచ్ తనను వేధించాడు. ఆ బాలికను కోచ్ తన గదిలోకి పిలిచి వేధించాడు. ఆ సమయంలో మిగతా జట్టంతా పార్క్ లో వేచి ఉండాలని ఆదేశించాడు. ఈ సంఘటన జరిగిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మే1, 2021న జరిగిన వెబ్‌నార్ లో జస్టిస్ భల్లా ఓ పాఠశాలకు వెళ్లారు. బాలికలపై నేరాలకు పాల్పడిన వారి గురించి తల్లిదండ్రులకు, సంరక్షకులు, టీచర్లకు చెప్పాలని, నేరాలను ఎట్టిపరిస్థితుల్లో సహించవద్దని జస్టిస్ భల్లా విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ధైర్యాన్ని నూరిపోశారు. జస్టిస్ భల్లా ప్రసంగం నుంచి ప్రేరణ పొందిన ఆ బాలిక.. తనపై వేధింపులకు పాల్పడ్డ కోచ్ పై కేసు పెట్టడానికి ముందుకు వచ్చింది.
తను ఎదుర్కొన్న వేధింపుల గురించి ధైర్యంగా చెప్పింది. బాలిక ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పాఠశాల అధికారులు కసోల్ పోలీసులకు సమాచారం అందించి కోచ్ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాతపూర్వక ఫిర్యాదును అజ్మీర్ పోలీసు అధికారులకు పంపించారు. ఆ ఫుట్‌బాల్ కోచ్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. ఇరు పక్షాల వాదనల అనంతరం పోక్సో కోర్టు ఫుట్‌బాల్ కోచ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా విధించింది. బాధిత పరిహార పథకం (విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్) కింద బాలికకు రూ. 6 లక్షల పరిహారం ఇవ్వాలి కోర్టు ఆదేశించింది.