ZPTC Byelections Pulivendula Ontimitta | తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ZPTC ఉపఎన్నికలు | ABP Desam
జరిగినవి ZPTC బై ఎలక్షన్సే కదా అని వదిలేయలేదు. రెండు స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట. ఒకటి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం...రెండోది రాముల వారు కొలువైన ఒంటిమిట్ట. ఈ రెండు స్థానాల్లో జరిగిన ZPTC ఎన్నికల పోలింగ్ కొట్లాటలు, వాగ్వాదాలు, బాహాబాహీలు, పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య ముగిసింది. ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ నేత సతీష్ రెడ్డి హౌస్ అరెస్ట్ ల తర్వాత ప్రారంభమైన పోలింగ్..ఆ తర్వాత కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పులివెందులలో 15పోలింగ్ కేంద్రాల్లో..ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ కొన్ని చోట్ల తమ ఓటు వేరే వాళ్లు వేశారని..తమను ఓటు వెయ్యనివ్వట్లేదంటూ గొడవలకు దిగారు ఓటర్లు. రెండు చోట్లా 11మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్య కావటంతే పోలింగ్ ఏజెంట్ల పైనా దాడులు జరిగాయి. పోలీసులు ఎక్కడిక్కడ ఇరు పార్టీ కార్యకర్తలను చెదరగొడుతూ భద్రతను కట్టుదిట్టం చేయగా...వైసీపీ నేతలు మాత్రం పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా పోలీసుల తీరును తప్పుపడుతూ విమర్శలు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అవినాష్ రెడ్డి ఉన్న పులివెందుల వైసీపీ కార్యాలయానికి చేరుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అవినాష్ రెడ్డితో పాటే పులివెందుల వైసీపీ ఆఫీసులో కూర్చుని పోలింగ్ కి సహకరించాలని కోరారు. అవినాష్ తో పాటే చాలా సేపు కూర్చుని పరిస్థితులు సద్దుమణిగేలా చేశారు. మొత్తంగా చెదురుమొదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటలలోపు లైన్ లో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు.





















