Dewald Brevis Century 125* vs Aus | ఆస్ట్రేలియాపై భారీ సెంచరీతో రెచ్చిపోయిన డెవాల్డ్ బ్రేవిస్ | ABP Desam
బేబీ AB. డెవాల్డ్ బ్రేవిస్ ను సౌతాఫ్రికా క్రికెట్ ఫ్యాన్సే కాదు మన ఐపీఎల్లోనూ ముద్దుగా అదే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే 22 ఏళ్ల ఈ చిన్న కుర్రాడి ఆట తీరు అచ్చటం మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ లానే ఉంటుంది. బౌలర్ ఎవరనేది చూడడు. అస్సలు భయం అనేది కనపడదు ఆ కుర్రాడి కళ్లలో. బంతిని గ్రౌండ్ లో నలువైపులా బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ ఏడాది ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడి కొన్ని మెరుపులు మెరిపించిన డెవాల్డ్ బ్రేవిస్...నిన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద జరిగిన రెండో టీ20 లో రెచ్చిపోయాడు. టాస్ గెలిచి సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించామని ఆస్ట్రేలియా బాధపడేలా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బరిలోకి దిగి చివరి వరకూ నాటౌట్ గా ఉండి ఒక్కో ఆస్ట్రేలియన్ బౌలర్ లెక్కలు తేల్చేశాడు. మొత్తంగా 56 బంతుల్లో 12 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు బ్రేవిస్. సౌతాఫ్రికా తరపున టీ20ల్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కాగా...ఆస్ట్రేలియా పై ఓ ఆటగాడు కొట్టిన అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోరు కూడా ఇదే. అంతే కాదు సౌతాఫ్రికా తరపున అతి పిన్నవయస్సులో టీ20 సెంచరీ బాదిన ఆటగాడిగానూ 22ఏళ్ల డెవాల్డ్ బ్రేవిస్ రికార్డు నెలకొల్పాడు. బ్రేవిస్ భారీ సెంచరీతో సౌతాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేయగా...ఛేజింగ్ లో తడబడిన ఆస్ట్రేలియా 165పరుగులకు ఆలౌట్ అయ్యింది. టిమ్ డేవిడ్ మాత్రమే హాఫ్ సెంచరీతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ ను కట్టిపడేయటంతో మూడు టీ20 ల సిరీస్ 1-1తో సమం చేసింది సౌతాఫ్రికా. మొత్తంగా తన ఆటతీరుతో జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే భారీ సెంచరీ బాది తను బేబీ AB కాదు కాబోయే బాహుబలి అని చాటి చెప్పాడు డెవాల్డ్ బ్రేవిస్.





















