Chandanagar Khazana Jewelers Gun Firing | చందానగర్ ఖజానా జ్యూయలరీస్ లో కాల్పుల కలకలం | ABP Desam
హైదరాబాద్ లోని చందానగర్ ఖజానా జ్యూయలరీస్ లో కాల్పులు కలకలం రేపాయి. పట్టపగలే దొంగతనానికి వచ్చిన ఆరుగురు దుండగులు తుపాకులతో హల్ చల్ చేశారు. మొహాలకు ముసుగులు ధరించి చందానగర్ లోని ఖజానా జ్యూయలరీస్ లోకి ఉదయం 10.30 ప్రాంతంలో వచ్చిన దుండగులు అప్పుడే దుకాణం కౌంటర్లు తెరుస్తున్న సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. లాకర్ కీస్ ఇవ్వాలని దుండగులు అడగగా ఇవ్వకుండా ఎదురు తిరగబోయిన సిబ్బందిని భయపెట్టేందుకు దొంగలు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్ కాలికి బులెట్టు తగిలింది. దీంతో భయపడిపోయిన సిబ్బంది పరుగులు తీయగా...బంగారు లాకర్లు తెరిచేందుకు వీలు లేకపోవటంతో కౌంటర్లు పగులగొట్టి వెండి వస్తువులు తీసుకువెళ్లారు. ఈలోగా కొంత మంది సిబ్బంది పోలీసులకు సమాచారం అందించటంతో అప్రమత్తమైన దొంగలు గన్స్ చూపిస్తూ పరారయ్యారు. సమాచారం అందుకున్న సీపీ అవినాష్ మొహంతి సహా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు నగల దుకాణం మొత్తం తమ అధీనంలోకి తీసుకుని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు సీసీ కెమెరాల ద్వారా ప్రాథమిక ఆధారాలను సేకరించారు.





















