(Source: ECI/ABP News/ABP Majha)
Congress Chintan Shivir: ఆత్మ పరిశీలనా? ఆత్మస్తుతా? నేటి నుంచే మూడు రోజులపాటు కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ సభలు
సమస్యలు ఎదురైన ప్రతిసారీ చింతన్ శిబిరాలు పెట్టుకొని ఆత్మ పరిశీలన చేసుకోవడం కాంగ్రెస్‌కు ఉన్న అలవాటు. ఇప్పుడు అదే చేస్తోంది. మరి ఆత్మ పరిశీలన చేసుకుంటుందా? ఆత్మస్తుతితో సరిపెట్టుకుంటుందా?
127 ఏళ్ల చరిత్ర.. స్వాతంత్ర సంగ్రామంతో అనుబంధం.. దశాబ్ధాల పాటు పరిపాలన సాగించిన అనుభవం.. ఇప్పుడు ఇవేవి కాంగ్రెస్ పార్టీని కాపాడలేకపోతున్నాయి. వరుస వైఫల్యాలతో దేశంలో ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి తన వైభవాన్ని పుంజుకునేందుకు పాట్లు పడుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత తనకు గట్టి పట్టు ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలనలో పడింది. వరుస ఓటములకు గల కారణాలను విశ్లేషించుకునేందుకు సిద్దమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నవ సంకల్ప చింతన్ సభలో పూర్తిగా విశ్లేషించుకునే పనిలో పడింది.
నాలుగోసారి ప్రత్యేక సభ..
కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం కోసం ఇప్పటి వరకు మూడు సార్లు ఇలాంటి సభలను ఏర్పాటు చేసింది. 1998లో పాచ్‌మడీ, 2003లో సిమ్లా, 2013లో జైపూర్‌లో సభలను ఏర్పాటు చేసింది. అయితే ఈ మూడు సభలు నిర్వహించినప్పుడు దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా ఉండేది. చాలా రాష్ట్రాల్లో అధికార పక్షంగా ఉంటూ కీలకంగా ఉంది. ప్రస్తుతం మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో రెండు సార్లు పరాజయం పాలవడంతోపాటు బలమైన రాష్ట్రాలను కోల్పోయింది.
ఓ విధంగా చెప్పాలంటే తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న చింతన్‌సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడాదిలో తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు బీజేపీకి బలమైన పునాధులు వేసిన గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తాము అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను కాపాడుకోవడంతోపాటు గుజరాత్‌లో మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే టైంలో బీజేపీ ప్రభంజనానికి చెక్ పెట్టాలని మేధోమథనం చేస్తోంది. అందుకు తగ్గ వ్యూహంతో కాంగ్రెస్‌పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను కాపాడుకుంటూ మరికొన్ని రాష్ట్రాల్లో కీలక శక్తిగా ఎదిగి పూర్వవైభవం సంతరించుకునేందుకు కావాల్సిన శక్తియుక్తులపై చింతన్‌సభలో చర్చించనుంది. పార్టీలో చేయాల్సిన అంతర్గత మార్పులతోపాటు దేశ రాజకీయాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సభలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
యువకులకు, మహిళలకు ప్రాధాన్యత..
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అవరోధంగా సీనియర్‌లు తయారయ్యారనే విమర్శలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. దిల్లీలో తిష్టవేసే ఈ నాయకులు వల్ల స్థానికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కాలం చెల్లిన సీనియర్ల వ్యూహాల వల్ల పార్టీకి ప్రజల ఆదరణ లభించడం లేదనేది ప్రస్తుతం చాలా మంది నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు ఉన్న వేళ... పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అధికారం దిశగా పరుగులు పెట్టించేందుకు ఏం చేయాలనేది ఆలోచించనుంది అధిష్ఠానం. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే చింతన్ సభ వేదికగా దేశ వ్యాప్తంగా యువకులకు, మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే ప్రకటనలు ఏమైనా ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. 50 ఏళ్ల లోపు ఉన్న వారికి 50 శాతం అవకాశం కల్పించనుందని సమాచారం.
ప్రజాసమస్యలపై ప్రత్యేక చర్చ
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై ఫోకస్ పెడుతూనే... దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనుందీ సమావేశం. బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో పెరిగిన ధరలు, ఆస్తుల అమ్మకాలు, రాష్ట్రాల హక్కులు ఇలాంటి చాలా అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రత్యేక చర్చల ద్వారా నిర్ణయాలు..
మూడు రోజుల పాటు జరిగే నవసంకల్ప చింతన్‌సభలో ఆరు గ్రూపులుగా ఏర్పాటు చేసి సమకాలీన రాజకీయాలపై విశ్లేషణ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా సంస్థాగతంగా పార్టీలో మార్పులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతోపాటు సంస్థాగతంగా మార్పులు చేస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధానంగా యువకులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
గడ్డు పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఆత్మపరిశీలన సభలను ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈసారి అదే పంథా అనుసరిస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే సభలు దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా..? కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తీసుకొస్తుందా..? పార్టీ క్యాడర్‌కు ఈ సమావేశాల ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తుందో చూడాలి.