MGNREGS: బ్యాంకు ఖాతాలోనే ఉపాధి హామీ డబ్బుల జమా, సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
MGNREGS: ఉపాధి హామీ డబ్బులను బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
MGNREGS: ఉపాధి హామీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద నమోదైన వారికి వేతనాలు చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థని ఈ ఏడాది జనవరిలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కార్మికులకు డబ్బు చెల్లించడానికి ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని అమలు చేయడానికి ఆగస్టు 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. అయితే ఈ తేదీని పొడిగించే ప్రసక్తి లేదని, సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేసిన తీరాల్సిందేనని మరోసారి ఆదేశించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలని అందుకోసం మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత గడువు తేదీని జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. మరోసారి గడుపు పెంచుతూ ఆగస్టు 31ని నిర్ణయించింది. అయితే ఇక మీదట గడువు తేదీ పొడగించబోమని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. యాక్టివ్ వర్కర్ల ఖాతాల్లో 90 శాతానికి పైగా ఇప్పటికే ఆధార్ తో అనుసంధానించినందు వల్ల గడువును ఇకపై పొడిగించబోమని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
జూన్ లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మొత్తం 14.28 కోట్ల యాక్టివ్ లబ్ధిదారుల్లో, 13.75 కోట్లతో ఆధార్ నంబర్ సీడింగ్ చేసినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం 12.17 కోట్ల ఆధార్ నంబర్లు ప్రామాణీకరించబడినట్లు తెలిపింది. 77.81 శాతం మంది ఆ సమయంలో ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థకు అర్హులుగా గుర్తించారు. మే 2023లో, దాదాపు 88 శాతం వేతన చెల్లింపు ఏబీపీఎస్ ద్వారానే జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకుని జాబ్ కార్డులు ఉన్న దాదాపు 1.13 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలు లేదా ఈ పథకం కింద ఉన్న యాక్టివ్ కార్మికుల్లో దాదాపు 8 శాతం మంది బ్యాంకు ఖాతాలు ఇంకా ఆధార్ తో సీడింగ్ జరగలేదని.. ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Also Read: Brics Summit 2023: బ్రిక్స్‌లో 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం, కూటమి బలోపేతం అవుతుందన్న మోదీ
ఆధార్ సీడింగ్ ప్రక్రియలో ఈశాన్య రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని తెలిపారు. అస్సాంలో 42 శాతం కంటే ఎక్కువ, అరుణాచల్ ప్రదేశ్ లో 23 శాతం, మేఘాలయలో 70 శాతానికి పైగా, నాగాలాండ్ లో 37 శాతం మంది కార్మికుల ఖాతాలు ఆధార్ నంబర్లతో సీడింగ్ కాలేదని పేర్కొన్నారు. ప్రత్యక్ష ఖాతా బదిలీతో పాటు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానంగా ఏబీపీఎస్ ను 2017 నుంచి ఉపాధి హామీ పథకంలో ఉపయోగిస్తున్నారు. 100 శాతం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లబ్ధిదారులను ఏబీపీఎస్ కిందకు మారేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది.