పాకిస్థాన్‌కి రవి నదీ నీళ్ల సరఫరా నిలిపివేసిన భారత్, ఆ బ్యారేజ్ నిర్మాణంతో సప్లైకి బ్రేక్
Ravi River Water: పాకిస్థాన్‌కి రవి నదీ నీళ్ల సరఫరాని భారత్ నిలిపివేసింది.
Ravi River Water Supply: రవి నది (Ravi Water Supply) నుంచి పాకిస్థాన్‌కి నీళ్లు పంపడాన్ని భారత్ నిలిపివేసింది. ఎప్పటి నుంచో ఈ నీళ్లు నిలిపివేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే..ఇక్కడ దాదాపు 45 ఏళ్లుగా డ్యామ్ నిర్మాణం కొనసాగుతోంది. ఇన్నాళ్లకు ఇది పూర్తైంది. ఈ మేరకు ఇకపై రవి నదీ నీళ్లు పాకిస్థాన్‌కి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ నదిపై భారత్‌కి పూర్తి హక్కులున్నాయి. 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీ (Indus water treaty) ఒప్పందం ప్రకారం...రవి నదీ నీళ్లపై భారత్‌కే హక్కులు వచ్చాయి. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ ఈ ఒప్పందాన్ని కుదిర్చింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఈ Shahpur Kandi barrage నిర్మాణం చేపట్టారు. అయితే..జమ్ముకశ్మీర్ వివాదం కారణంగా అప్పటి నుంచి నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ కారణంగా భారత్‌కి చెందిన నదీ నీళ్లు పాకిస్థాన్‌కి వెళ్లాయి. రవితో పాటు సుత్లేజ్, బియాస్ నదీ నీళ్లపైనా భారత్‌కి హక్కులున్నాయి. ఇండస్, ఝెలమ్, చినాబ్ నదులపైన పాకిస్థాన్‌కి హక్కులున్నాయి. 1979లో పంజాబ్, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాలు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాకిస్థాన్‌కి నీళ్లు వెళ్లకుండా రంజిత్ సాగర్ డ్యామ్‌తో పాటు షాపూర్ కంది బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు. అప్పటి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మహమ్మద్ అబ్దుల్లా, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ ఒప్పందంపై సంతకం పెట్టారు. 1982లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు. 1998 నాటికే ఇది పూర్తవ్వాల్సి ఉన్నా అది సాధ్యం కాలేదు.
ఎన్నో సవాళ్లు దాటుకుని..
2001లో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తైనా...షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ఫలితంగా రవి నది నుంచి పాకిస్థాన్‌క్ నీళ్లు పంపాల్సి వచ్చింది. 2008లోనే షాపూర్ కంది ప్రాజెక్ట్‌ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. కానీ...నిర్మాణం 2013లో ప్రారంభమైంది. పంజాబ్, జమ్ముకశ్మీర్ మధ్య ఉన్న విభేదాల కారణంగా 2014లో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 2018లో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసేలా చొరవ చూపింది. ఆ తరవాతే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో ఈ నదీ నీళ్లన్నీ జమ్ముకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లోని వ్యవసాయం కోసం వినియోగించుకునేందుకు వీలవుతుంది. 1150 క్యూసెక్కుల నీళ్లతో జమ్ముకశ్మీర్‌లో 32 వేల హెక్టార్లకు నీళ్లందించవచ్చు. హైడల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ నీళ్లను వినియోగించుకునేందుకు వీలవుతుంది. 55.5 మీటర్ల ఎత్తైన షాపూర్ కందీ డ్యామ్‌ని మల్టీ పర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు అధికారులు. దీని ద్వారా రెండు హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు అవకాశముంటుంది. దీని ద్వారా 206 మెగావాట్‌ల విద్యుత్‌ని ఉత్పత్తి చేయచ్చు. జమ్ముకశ్మీర్‌తో పాటు అటు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకూ ఈ డ్యామ్ ద్వారా మేలు జరగనుందని అధికారులు వెల్లడించారు.
Also Read: జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక మలుపు, హిందువుల పూజలకు లైన్ క్లియర్