Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో
Gujarat Elections:గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్ ఒవైసీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Gujarat Elections 2022:
గెలిపించాలంటూ కన్నీళ్లు..
గుజరాత్ రెండో విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రచారం హోరెత్తిపోయింది. కాంగ్రెస్, బీజేపీ ఆప్‌తో పాటు ఈ సారి AIMIM పార్టీ కూడా కాస్త దూకుడుగానే వ్యవహరించింది. అసదుద్దీన్ ఒవైసీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఒవైసీ ఓ సభలో ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. జమల్‌పూర్‌లోని ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు అసదుద్దీన్. పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసే సమయంలో ఏడ్చేశారు. "మన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. బిల్కిస్ బానోకి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు" అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఒవైసీ. ఆ అల్లా తమ పార్టీ అభ్యర్థి గెలిచేలా కరుణ చూపాలని వేదికపైనే ప్రార్థించారు. ఇదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. తమ పార్టీని బీజేపీ
B Team అంటూ వచ్చే ఆరోపణలపైనా స్పందించారు. "బీజేపీ గెలవడానికి మేమెప్పటికీ సహకరించం. ఆ పని కాంగ్రెస్, ఆప్ చేస్తున్నాయి" అని ఆరోపించారు.
असदुद्दीन ओवैसी गुजरात के जमालपुर में भाषण के दौरान अचानक रो पड़े. pic.twitter.com/oY1imUO0kr
— HasNain Alam (@HassuNain) December 3, 2022
బీజేపీపై విమర్శలు..
గుజరాత్ అల్లర్ల విషయంలో కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "2002 గుజరాత్‌లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పాం" అని ఇటీవల అమిత్‌షా అన్నారు. దీనిపై ఒవైసీ కౌంటర్‌లు వేశారు. "కేంద్రమంత్రి అమిత్‌షా గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామనీ చెప్పుకుంటున్నారు. కానీ ఆయన చెప్పిన పాఠాలేంటో తెలుసా..? బిల్కిస్‌ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి మూడేళ్ల కూతురుని హత్య చేసిన నేరస్థులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలనీ మాకు నేర్పించారు" అని విమర్శలు చేశారు. "మీరు చెప్పిన పాఠాలను ఎన్నని గుర్తుంచుకోవాలి..? ఇలా పాఠాలు చెప్పడం వల్ల జరిగేదేమీ లేదు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుంది" అని వ్యాఖ్యానించారు ఒవైసీ. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదని అన్నారు. "అధికారం ఎప్పుడూ ఒకరికే పరిమితం కాదు. ఎప్పుడో ఓ రోజు ఆ అధికారం చేతులు మారుతుంది. ఆ అధికార మత్తులో ఉండి అమిత్‌షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేం పాఠం నేర్పారు..? దేశమంతా మీ పరువు పోయింది. ఢిల్లీలోనూ మత కల్లోలాలు జరిగినప్పుడు మీరేం పాఠం చెప్పారు" అని ప్రశ్నించారు.
Also Read: Midnapore Bomb Blast: తృణమూల్ నేత ఇంట్లో నాటు బాంబు పేలుడు, ఇద్దరు మృతి