Covid Deaths ExGratia : కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?
కరోనా మరణాలను ప్రభుత్వాలన్నీ తక్కువ చేసి చూపించాయి. సాధారణ మరణాలుగా డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నందున ఆ కుటుంబాలన్నీ మళ్లీ అన్యాయం అయిపోతున్నట్లేనా ?
కరోనా బారిన పడిన చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలను సుప్రీంకోర్టు ఒత్తిడితో ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. రాష్ట్రాల విపత్తు నిధి కింద ఒక్కో కుటుంబానికి రూ. యాభై వేలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. దీంతో కరోనా బాధిత కుటుంబాలు కాస్తంతైనా ఊరట పొందే అవకాశం ఉంది. మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఇప్పటి వరకు మరణించిన వారితోపాటు భవిష్యత్తులోనూ కోవిడ్‌తో ప్రాణాలు విడిచిన వారందరికి పరిహారం వర్తిస్తుంది. కోవిడ్ మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసిన 30 రోజుల్లో చెల్లింపులు !
పరిహారం కోసం బాధిత కుటుంబాలు క్లెయిమ్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫామ్స్ నింపి, డాక్యుమెంట్లు జత చేయాలి. జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు వాటిని పరిశీలించి 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ ద్వారా ఫ్యామిలీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. దరఖాస్తులో ఏవైనా సమస్యలుంటే జిల్లా లెవల్ కమిటీ పరిష్కరిస్తుంది. దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాలను రికార్డు చేయాల్సి ఉటుంది. రాష్ట్రాల విపత్తు సహాయ నిధి చెల్లింపులు చేస్తారు.
Also Read : "పీఎం కేర్స్" ప్రభుత్వ నిధి కాదా ? విరాళాలు, ఖర్చులు ఎందుకంత రహస్యం !?
కరోనా మరణాలను దాచిన ప్రభుత్వాలు !
తమ వద్ద మరణాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవడానికి కావొచ్చు .. లేకపోతే కరోనా కంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చనిపోయారని చలెక్కలేయడం కావొచ్చు .. ఏదైనా కానీ కరోనా మరణాలను ప్రభుత్వాలు తక్కువగా చూపించాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు. కానీ చనిపోయిన వారు మాత్రం లక్షల్లో ఉన్నారు. పరిహారం పొందే ప్రక్రియలో ప్రధానమైనది మరణ ధ్రువీకరణ పత్రం. అందులో కోవిడ్ వల్ల సంభవించినట్లుగా ఉండాలి. కానీ అత్యధిక మరణాలకు గుండె పోటు కారణంగా డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. కరోనా పేరుతో జారీ అయిన డెత్ సర్టిఫికెట్లు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,46,050 మంది మాత్రమే ఉన్నారు. కేంద్రం ప్రకటన ప్రకారం వీరు మాత్రమే పరిహారానికి అర్హులు.
Also Read : 'క్వాడ్' సదస్సులో శాంతి మంత్రం.. వ్యాక్సిన్ సరఫరా, ప్రపంచ భద్రతే లక్ష్యం
సెకండ్ వేవ్‌లో అసాధారణ సంఖ్యలో మరణాలు !
మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ సమయంలో మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయలో దేశంలో స్మశానాల దగ్గర పరిస్థితి అందరితోనూ కన్నీరు పెట్టించింది. అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య సాధారణం స్థాయి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. అయితే ఆ మరణాలన్నీ కరోనా మరణాలు కిందకు కాలేదు. ప్రభుత్వాలు కరోనా మరణాలను తక్కువ చేసి చూపించడానికి సాధారణ మరణాలుగా చెప్పేందుకు ప్రయత్నించాయి. ఈ కారణంగా ఇప్పుడు కరోనా బారిన పడి చనిపోయినా వారి కుటుంబాలకు సాయం అందడం కష్టంగా మారనుంది. ఒక్క కరోనా కారణంగానే చనిపోరు. అప్పటికి శరీరంలో ఉన్న వివిధ అనారోగ్య సమస్యలకు కరోనా తోడైతే చనిపోతారు. అత్యధిక మందిలో జరిగింది ఇదే. కానీ మరణాల నమోదు విషయంలో కార్డియాక్ అరెస్ట్ అని.. మరొకటి అని రాసి మరణ ధృవపత్రాలు జారీ చేశారు. ఈ కారణంగా కరోనాతో చనిపోయిన కొన్ని లక్షల మందికి పరిహరం అందడం గగనంగా మారనుంది.
Also Read : ఇంటి వద్దే కరోనా వ్యాక్సిన్... త్వరలో పూర్తి కార్యాచరణ... కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ మరణాల నమోదు..కానీ కోవిడ్ వల్ల కాదు !
తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ విజృంభించినప్పుడు అసాధారణ మరణాలు సంభవించాయి. ప్రతి ఒక్కరూ తమ సన్నిహితుల్ని కోల్పోయామని బాధపడ్డారు. గత మే నెలలోఆంధ్రప్రదేశ్‌లో లక్షా మూడు వేల మంది మరణించారని అధికారిక డేటా వెల్లడించింది. ఆ నెలలో కోవిడ్ మరణాలను మాత్రం ప్రభుత్వం మూడు వేలకు కొద్దిగా ఎక్కువగా చూపించింది. ఇప్పటి వరకూ ఏపీలోకరోనా మరణాలు అధికారికంగా 14వేలు మాత్రమే. సాధారణ మరణాలు జనవరిలో 4978, ఫిబ్రవరిలో 1908,. మార్చిలో 5655, ఏప్రిల్‌లో 12744 నమోదయ్యాయి. అదే మేకి వచ్చే సరికి లక్షకుపైగా నమోదయ్యాయి. అంటే.. సగటును మించి..పది, ఇరవై రెట్ల వరకూ అధికంగా మరణాలు నమదైనట్లు వెల్లడయింది. తెలంగాణలోనూ అదే పరిస్థితి. మే నెలలో హైదరాబాద్‌లో ప్రకటించిన కోవిడ్ మరణాల కన్నా... అధికారిక లెక్కల ప్రకారం.. పది రెట్లు మరణాలు ఎక్కువ. మూడు వేల మరణాలను ప్రభుత్వం ధృవీకరిస్తే.., ముఫ్పై ఐదు వేల మంది ఒకే నెలలోచనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇవన్నీ అధికారికంగా... ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన లెక్కలు.
Watch Video : తెలంగాణ రక్తచరిత్ర.. కొండా దంపతులపై ఆర్జీవీ సినిమా
మరణాల లెక్కల్ని రివైజ్ చేసిన కొన్ని రాష్ట్రాలు !
కరోనా మరణాల్ని తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు తర్వాత లెక్కలు మార్చాయి. బీహార్ మరణాల లెక్కల్ని రివైజ్ చేసి.. ఒక్క రోజే తొమ్మిదివేల మరణాల్ని ప్రకటించింది. మహారాష్ట్ర కూడా డెత్ టోల్ మొత్తాన్ని పునంసమీక్ష చేసి.. లక్షా ఎనిమిది వేల మంది కరోనా కారణంగా చనిపోయారని తేల్చింది. ఆయా నెలల్లో నమోదైన అధికారిక మరణాలు.. ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాలు ఎప్పుడూ నమోదయ్యే సాధారణ మరణాల శాతాన్ని పోల్చి చూస్తే కరోనా మృతుల సంఖ్య అధికారికం కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Watch Video : SPB First Death Anniversary: మీ పాటలతో మీరెప్పుడు మా తోనే ఉంటారు
డెత్ సర్టిఫికెట్లను ట్రీట్‌మెంట్ రికార్డులతో వెరీఫై చేసి మార్పులుచేస్తారా ?
ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిర్ణయించడంతో తమ వారు కరోనాతోనే చనిపోయారని డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నట్లుగా రిపోర్టులు తీసుకెళ్లి తమ వారి డెత్ సర్టిఫికెట్లలో మార్పులు చేయాలని కోరే అవకాశం ఉంది. అియతే ప్రభుత్వాలు ఎంత మేరకు బాధితులకు న్యాయం చేస్తాయన్నది సందేహాస్పదమే. కరోనా వల్ల అన్ని విధాలుగా మృతుల కుటుంబాలు అన్యాయమైపోతున్నాయి.
Also Read : పగ తీర్చుకోవడానికి ఈ కోతి 22 కిలోమీటర్లు నుంచి వచ్చింది... కర్ణాటకలో వింత ఘటన