Heavy Fog: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు - వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
Fog: తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేయగా విమానాలు ఆలస్యంగా నడిచాయి.

Heavy Fog In AP And Telangana: తెలుగు రాష్ట్రాలను పొగమంచు కప్పేసింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున కురిసిన దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించక వాహనదారులు నెమ్మదిగా వాహనాలు నడిపారు. హైదరాబాద్ - విజయవాడ హైవేపై హెడ్ లైట్ల వెలుగులో ప్రయాణాలు సాగించారు. పొగమంచు దట్టంగా కురుస్తోన్న వేళ కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అటు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. రన్ వే విజిబులిటీ లేక విమానం ల్యాండింగ్‌లో జాప్యం జరుగుతోంది.
ఆహ్లాదం వెనుకే ప్రమాదం..
తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఆహ్లాదంగా ఉంటుంది. కానీ దాని వెనుకే ప్రమాదం సైతం దాగి ఉంది. మంచు కురిసే వేళలో ప్రయాణం చేయడం ప్రమాదాలకు దారి తీస్తోంది. దట్టమైన పొగ మంచు రహదారిని కమ్మేసి చిమ్మ చీకట్లు అలముకున్నా కొందరు ప్రయాణం మాత్రం ఆపరు. ప్రమాదకరమని తెలిసినా.. గమ్య స్థానానికి చేరడం కోసం స్పీడ్ లిమిట్ లేకుండా వాహనాలు నడుపుతుంటారు. ఈ క్రమంలోనే ముందున్న వాహనాలు, ప్రమాదకర మలుపులు గుర్తించలేక ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ రహదారులపైనే అత్యధికంగా పొగ మంచు వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పోలీసులు, రవాణా శాఖ కొన్ని డేంజర్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రమాద సూచికలు పెట్టినా కొందరు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. రహదారులను కమ్మేసిన పొగమంచు వాహనదారుల ప్రాణాలు మింగేస్తోంది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.
ప్రాణాలు తీస్తున్న పొగమంచు..
ఈ పొగమంచు ప్రమాదాల వల్ల ఎంతోమంది విగత జీవులుగా మారుతున్నారు.హైదరాబాద్ (Hyderabad) నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అటు ఏపీకి వెళ్లే 3 జాతీయ రహదారులు వరంగల్ ఉమ్మడి జిల్లా మీదుగానే వెళ్తుంటాయి. పొగమంచు ప్రభావంతో కేవలం ఒక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే గతేడాది జరిగిన ప్రమాదాల్లో 171 మంది చనిపోయారు. కొత్త సంవత్సరంలో ఇప్పటికే ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. హెడ్ లైట్స్ వేసుకొని వాహనాలు నడుపుతున్నా దట్టమైన పొగమంచు అలముకోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా లారీలు, ఇతర వాహనాలు రహదారుల పక్కనే నిర్లక్ష్యంగా పార్కింగ్ చేయడం వల్ల వెనుక నుంచి ఢీకొని ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం దేవరుప్పుల వద్ద జరిగిన అలాంటి ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. గురువారం ఉదయం వరంగల్ – హైదారాబాద్ మద్య జాతీయ రహదారిపై రాయగిరి వద్ద కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన తల్లీబిడ్డలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.





















