Covid19 Vaccination Update: ఇంటి వద్దే కరోనా వ్యాక్సిన్... త్వరలో పూర్తి కార్యాచరణ... కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
ఇంటి వద్దే వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియకు కేంద్రం చర్యలు చేపట్టింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే వ్యాక్సిన్ ఇచ్చేందుకు త్వరలో పూర్తి ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపింది.
కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దే వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టనుంది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు కార్యచరణ చేపట్టబోతుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించింది. అదే విధంగా భారత ప్రయాణికులకు బ్రిటన్ క్వారంటైన్ విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వారు లేదా దివ్యంగులకు ఇంట్లోనే టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసిందన్నారు.
బ్రిటన్ విధానంపై అభ్యంతరం
ఈ విషయంపై త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. భారత ప్రయాణికులకు యూకేలో క్వారంటైన్ విధించడంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ సమావేశంలో మాట్లాడారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ను పూణేకి చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తున్నట్లు గుర్తుచేశారు. కోవిషీల్డ్ వేసుకున్న వారికి క్వారంటైన్ విధించడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. దీనిని వివక్ష చర్యగా అభివర్ణించింది. దీనికి పరస్పర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ సమస్యను పరస్పర పరిష్కరించుకోవాలని కోరింది. బ్రిటన్ తీసుకొచ్చిన కార్వంటైన్ నిబంధనలు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి రానున్నాను. భారత్ లో రెండు డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ పొందిన వారిని కూడా 10 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదొక మైలురాయి
కేంద్ర ఆరోగ్యశాఖ భూషణ్ మాట్లాడుతూ, అక్టోబర్ 4 నుంచి బ్రిటన్ అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనలు వివక్షపూరితమన్నారు. ఈ సమస్యపై ఇరు దేశాలు మాట్లాడుతున్నాయని తెలిపారు. సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితులను మంత్రిత్వ శాఖ వివరించింది. దేశ జనాభాలో మూడింట రెండు వంతుల వయోజనులకు ఒక డోస్ టీకా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 18 కంటే ఎక్కువ వయసు గల వారిలో 66 శాతం మందికి కనీసం ఒక డోస్‌ని అందుకున్నారు. "వయోజన జనాభాలో దాదాపు పావు వంతు రెండు మోతాదులను పొందారు. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: Covid 19 Vaccine Export: భారత ఆరోగ్యమంత్రికి డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు.. కారణమిదే
66 శాతం మందికి కోవిడ్ టీకాలు
18 ప్లస్ వయసు గల వారిలో 66 శాతం మందికి కనీసం ఒక మోతాదు కోవిడ్ టీకాలు వేశామన్నారు. 18 ప్లస్ జనాభాలో 23 శాతం మందికి రెండు డోస్‌లు పూర్తిచేశామన్నారు. కొన్ని రాష్ట్రాల అద్భుతమైన పని కారణంగా ఇది సాధ్యమైందని రాజేష్ భూషణ్ అన్నారు. వరుసగా 12వ వారం వీక్లీ పాజిటివిటీ రేటు తగ్గుతూనే ఉందని, 3 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 97.8 శాతం ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో 31,000 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ కేసుల్లో చాలా వరకు కేరళ, మహారాష్ట్ర నుంచే ఉన్నాయని అధికారులు తెలిపారు. గత వారంలో మొత్తం కేసులలో 62.73 శాతం కేరళ నుంచే నమోదయ్యాయని ప్రకటించింది.
Also Read: UK's Travel Advisory: కోవిషీల్డ్‌పై గందరగోళం.. కోవిన్ ధ్రువపత్రంతో సమస్య ఉందంటున్న యూకే..
అక్కడ 100 శాతం వ్యాక్సినేషన్
కోవిడ్ -19 టీకా డ్రైవ్ లో ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మొదటి మోతాదులో 100 శాతం పూర్తి చేయాని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవి లక్షద్వీప్, ఛండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం. నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మొదటి మోతాదులో 90 శాతానికి పైగా కవర్ చేశారని తెలిపింది. ఇవి దాద్రా, నాగర్ హవేలి, కేరళ, లడఖ్, ఉత్తరాఖండ్.