Google Layoffs: గూగుల్‌లో మళ్లీ లేఆఫ్‌లు, వాయిస్ అసిస్టెంట్ టీమ్‌లోని ఉద్యోగులకు గుడ్‌బై
Google Layoff: గూగుల్‌లోని హార్డ్‌వేర్ సహా పలు టీమ్స్‌లోని 100 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది.
Google Layoff Hardware Team:
గూగుల్‌లో ఉద్యోగాల కోతలు..
గూగుల్‌లో లేఆఫ్‌లు (Google Layoffs) కొనసాగుతూనే ఉన్నాయి. పేరెంట్ కంపెనీ Alphabet ఇటీవలే లేఆఫ్‌లపై మరో కీలక ప్రకటన చేసింది. డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో వంద మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ లేఆఫ్‌లు కొన్నాళ్ల పాటు కొనసాగించక తప్పదని (Google Hardware Layoffs) తేల్చి చెప్పింది. వాయిస్ బేస్డ్ Google Assistant తో పాటు AR హార్డ్‌వేర్‌లోని ఉద్యోగులపై ఈ ఇంపాక్ట్ పడనుంది. వీళ్లతో పాటు కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులకూ వేటు తప్పడం లేదు. మారుతున్న పరిస్థితుల ఆధారంగా కంపెనీలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తోందని గూగుల్ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ డిపార్ట్‌మెంట్స్‌కి చెందిన ఉద్యోగులను తొలగిస్తామని స్పష్టం చేసింది.
"2023 సెకండాఫ్‌లో కంపెనీలోని చాలా వరకూ టీమ్స్‌లో మార్పలు చేర్పులు చేయాల్సి వచ్చింది. కేవలం పనిని మరింత ఎఫెక్టివ్‌గా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశాం. ఉన్న వనరులతోనే మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. కొన్ని టీమ్స్‌లో కొంత మందిని తొలగించక తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ లేఆఫ్‌ల ప్రభావం ఉంటుంది"
- గూగుల్ ప్రతినిధి
ఫిట్‌బిట్‌లోనూ..
ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించింది. ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే...గూగుల్‌లో వేరే ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. కానీ...ఉన్నట్టుండి ఇలా తొలగిస్తే ఎలా అని ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత దొరికే వరకూ పోరాడుతూనే ఉంటాం అని కొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ లేఆఫ్‌లు కొనసాగుతుండగానే Fitbit కంపెనీ కో ఓనర్స్‌తో పాటు మరి కొంత మంది కీలక వ్యక్తులు కంపెనీని వీడుతున్నారు. 2019 నవంబర్‌లో ఇవి మార్కెట్‌లోకి వచ్చాయి. అలా వచ్చాయో లేదో వెంటనే ట్రెండ్ సృష్టించాయి. గూగుల్ ఈ ఫిట్‌బిట్ కంపెనీని 2 బిలియన్ డాలర్లు ఇచ్చి కొనుగోలు చేసింది. కానీ...ఇప్పుడు ఈ సంస్థలోని కీలక ఉద్యోగులంతా వెళ్లిపోతున్నారు
ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది నుంచి మొదలైన ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి సంస్థలు. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని చెబుతున్నాయి. ఇటీవల ఓ కంపెనీ వీడియో కాల్ మాట్లాడుతుండగానే లేఆఫ్‌లు ప్రకటించింది. కేవలం 2 నిముషాల్లోనే అంతా జరిగిపోయింది. రెగ్యులర్ మీటింగ్‌లా అటెండ్ అయిన ఆ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది కంపెనీ. ఒకేసారి 200 మంది ఉద్యోగులను తొలగించింది. TechCrunch వెల్లడించిన వివరాల ప్రకారం Frontdesk కంపెనీ ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ వర్కర్స్‌తో పాటు కాంట్రాక్టర్‌లనూ ఇంటికి పంపేసింది. గూగుల్ మీట్ కాల్‌లోనే అందరికీ గుడ్ బై చెప్పింది. ఉన్నదే 200 మంది ఉద్యోగులు. వాళ్లందరినీ ఒకేసారి తీసేయడమే సంచలనమైంది. స్వయంగా సీఈవో కాల్‌లోకి వచ్చి షాక్ ఇచ్చాడు. అయితే...ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం చెప్పలేదు.