Markandey Katju New Political Party: రిటైర్డ్ జడ్జి కట్జూ సరికొత్త రాజకీయం - ఇష్క్ కరో పార్టీ స్థాపన! ఎంపీ మహువా మోయిత్రాకు బంపర్ ఆఫర్!
Ishq Karo Party Launch 2026: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ “ఇష్క్ కరో పార్టీ”ని ప్రకటించారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాను పార్టీలోకి ఆహ్వానించారు.

Mahua Moitra Invited to IKP: భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తనదైన శైలిలో సరికొత్త సంచలనానికి తెరలేపారు. దేశంలో సరికొత్త రాజకీయ ఒరవడిని తీసుకొస్తామంటూ ఆయన ఇష్క్ కరో పార్టీ అనే వినూత్నమైన రాజకీయ పార్టీని ప్రకటించారు. సమాజంలో పెరుగుతున్న విద్వేషాలను అరికట్టడానికి, దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజల మధ్య ఐక్యత, సామాజిక సామరస్యం మాత్రమే ఏకైక మార్గమని, అందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవలే దేశ రాజధానిలో నీట్ పరీక్షా అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన కాక్రోచ్ జనతా పార్టీపై పై కట్జూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీని, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్‌కేను ఆయన తీవ్రంగా విమర్శించారు. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలో.. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కట్జూ తప్పుపట్టారు. ఒక మంత్రిని తీసేసి మరొకరిని కూర్చోబెడితే వ్యవస్థాగత లోపాలు పోవని, కేవలం వ్యక్తుల రాజీనామాలపై కాకుండా విస్తృతమైన సంస్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు.
ఈ విచిత్రమైన పార్టీ పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కట్జూ వివరిస్తూ.. చాలామంది దీనిని వాలెంటైన్స్ డే తరహా రొమాన్స్ అని లేదా ఒక జోక్ అని కొట్టిపారేసే ప్రమాదం ఉందన్నారు. కానీ, ‘ఇష్క్’ అనే భావన కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతి విభేదాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటి చేసే ఒక శక్తివంతమైన ఆయుధమని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, అల్పాహార లోపం, అసమానతలు వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలంటే భారతీయులంతా ఒకరిపై ఒకరు ‘ఇష్క్’ పెంచుకొని సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
सुप्रीम कोर्ट के पूर्व जस्टिस मार्कंडेय काटजू ने 79 की उम्र में एक नई पार्टी बनाई जिसका नाम है -
— Vishal Pandey (@Vishal_aawaj) June 9, 2026
इश्क़ करो पार्टी
इतना ही नहीं जस्टिस Markandey katju ने TMC सांसद महुआ मोइत्रा को अपनी पार्टी जॉइन करने का प्रस्ताव रखा.
जस्टिस काटजू के अनुसार
उनकी नई पार्टी यानी Ishq Karo… pic.twitter.com/voLpGXLrL3
ప్రస్తుత రాజకీయ నేతలంతా కేవలం అధికారాన్ని కాపాడుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్ప, సామాన్య ప్రజల నిజమైన కష్టాలను పట్టించుకోవడం లేదని కట్జూ ఆరోపించారు. తమ పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక ఐక్యత కోసం అంకితభావంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రాను తమ ‘ఇష్క్ కరో పార్టీ’ లో చేరాల్సిందిగా బహిరంగంగా ఆహ్వానించడం విశేషం. అయితే ఈ వింత ఆహ్వానంపై సదరు మహిళా పార్లమెంటేరియన్ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
సాధారణంగానే సంచలన వ్యాఖ్యలు, విభిన్నమైన పోస్టులతో నిత్యం వార్తల్లో నిలిచే జస్టిస్ కట్జూ.. ఇప్పుడు ఏకంగా ‘ఇష్క్ కరో పార్టీ’ అంటూ రాజకీయ రంగప్రవేశం చేయడం సోషల్ మీడియాలో నెటిజన్లకు పెద్ద టాపిక్‌గా మారింది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ, మరోవైపు ఇష్క్ కరో పార్టీ.. ఇలాంటి వింత పేర్లతో వస్తున్న నయా రాజకీయ శక్తులు దేశంలోని యువతను, సామాన్య ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
ట్రెండింగ్ వార్తలు





















