Delhi Air Pollution: రూల్స్ పాటించని వాహనదారులు, భారీ జరిమానాలు వేస్తున్న పోలీసులు
Delhi Air Pollution: ఢిల్లీలో -కాలుష్య నిబంధనలు పాటించని వాహనాలపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
Delhi Air Pollution:
ఢిల్లీలో ఆ వాహనాలపై ఆంక్షలు
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు కాలుష్యానికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మార్పు రావటంలేదు. ప్రస్తుతానికి Graded Response Action Plan (GRAP) స్టేజ్ 3 నిబంధనలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల నిర్మాణాలపై నిషేధం విధించారు. వాహనాలూ ఎక్కువ మొత్తంలో తిరగకుండా ఆంక్షలు విధించారు. BS-3, BS-4 వాహనాలు రోడ్లపై తిరగకూడదని ప్రభుత్వం
ఆదేశాలిచ్చింది. అయినా కొందరు ఈ నిబంధనను పట్టించుకోకుండా రోడ్లపైకి వాహనాలు తీసుకొచ్చారు. వీరిపై పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధన ఉల్లంఘించిన 5,800 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ దాదాపు 5,882 వాహనాలపై చలానాలు విధించినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం ట్వీట్‌లో వివరాలు వెల్లడించింది. "కాలుష్య కట్టడికి BS-3, BS-4 వాహనాలపై నిషేధం విధించాం. ఈ నిబంధన ఉల్లంఘించిన 5,882 వాహనాలపై చలానాలు వేశాం" అని ట్వీట్ చేశారు. అత్యవసర వాహనాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. మరి కొన్ని రోజుల పాటు GRAD స్టేజ్ 3 నిబంధనలనే కొనసాగించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా..వెంటనే పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వాటిపై ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మోటార్ వాహనాల చట్టం కింద రూ.20 వేల జరిమానా విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికలు, ప్రభుత్వ సర్వీసులు, అత్యవసర సర్వీస్‌ల్లోని వాహనాలకు మాత్రం మినహాయింపునిస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ కాలుష్య సమస్య రోజురోజుకీ సంక్లిష్టమవుతోంది. ఎయిర్ క్వాలిటీ పడిపోతూ వస్తోంది. మరోసారి అక్కడి గాలి నాణ్యత "అత్యంత ప్రమాదకర స్థాయికి" చేరుకుందని అధికారులు వెల్లడించారు.
As part of restrictions on BS III Petrol and BS IV Diesel vehicles till
— Delhi Traffic Police (@dtptraffic) November 11, 2022
13th November to fight pollution, 5882 Vehicles were stopped/challaned for violations till 6 AM on 11.11.2022. Emergency vehicles are exempted. #DelhiPoliceUpdates pic.twitter.com/4zdzHznU0J
కట్టడి చర్యలు..
ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్‌ను మూసివేశారు. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో...ఈ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మరో కీలక ప్రకటన కూడా చేశారు. దాదాపు 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేస్తారని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కూడా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించే ఆలోచన చేయాలని సూచించారు. బీఎస్-6 వాహనాలకు తప్ప మిగతా వెహికిల్స్ రోడ్‌పైన తిరిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. కేవలం డీజిల్‌తో నడిచే లైట్ మోటార్ వెహికిల్స్‌కు పర్మిషన్ ఉంటుంది చెప్పారు. "పర్యావరణ్ బస్ సర్వీస్"లో భాగంగా 500 ప్రైవేట్ సీఎన్‌జీ బస్‌లను నడుపుతున్నట్టు తెలిపారు. ప్రజలు సొంత వాహనాలు పక్కన పెట్టి ఈ ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు. ఢిల్లీలో ప్రమాదకరమైన PM 2.5 కాలుష్యానికి...పంజాబ్‌లో రైతులు గడ్డి కాల్చటమే కారణమని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే...దేశ రాజధానిలో 34% మేర కాలుష్యం నమోదవుతోందని పేర్కొన్నారు. పంజాబ్ రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు గోపాల్ రాయ్. లక్షా 20 వేల మెషీన్లతో గడ్డిని పంట పొలాల్లో నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
Also Read: Army chief: ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం- దేనికైనా రెడీగా ఉన్నాం: ఆర్మీ చీఫ్