Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
Lawyer Murder News | వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో లాయర్‌ను హత్య చేసిన కానిస్టేబుల్‌ను, అతని స్నేహితుడిని చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా యడ్లవల్లిలో జరిగిన లాయర్ దారుణహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా బంధువైన లాయర్‌ను ఓ పోలీస్ కానిస్టేబుల్ తన స్నేహితుడితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాణాలు కాపాడాల్సిన ఖాకీ యూనిఫాం వేసుకున్న వ్యక్తే ఇంత దారుణం చేశాడని తెలిసి స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది.
లాయర్ హత్యకు ఫ్రెండ్‌తో కలిసి ప్లాన్
లాయర్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ హనుమంతరావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. చిలకలూరిపేట సమీపంలోని యడవల్లి పొలాల్లో శుక్రవారం లభ్యమైన మృతదేహాన్ని ఒంగోలుకు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37)గా పోలీసులు గుర్తించారు. హత్య వెనుక ఉన్న కారణాలు గుర్తించగా.. నిందితుడైన కానిస్టేబుల్ ఉసర్తి వెంకట కోటయ్యకు, మృతుడి భార్య నాగజ్యోతి వరసకు మరదలు అవుతుంది. వీరిద్దరి మధ్య వివాహానికి ముందే పరిచయం ఉంది. తన భర్త ప్రతిరోజూ మద్యం తాగి వేధిస్తున్నాడని ఆమె కానిస్టేబుల్‌కు చెప్పుకుని బాధ పడింది. దాంతో ఎలాగైనా సరే లాయర్ హరిప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని కానిస్టేబుల్ కోటయ్య ప్లాన్ చేశాడు. ఇందుకోసం గుంటూరుకు చెందిన తన స్నేహితుడు కొండారెడ్డి శ్రీనివాసరావు సహాయం కోరాడు.
మద్యం తాగించి హత్య చేసి ప్రమాదంగా..
ప్లాన్ ప్రకారం నిందితులిద్దరూ లాయర్ హరిప్రసాద్‌ను నరసరావుపేటకు పిలిపించి, అక్కడ మద్యం కొనుగోలు చేశారు. కోటప్పకొండ రోడ్డులోని ఎన్నెస్పీ కాలువ వద్దకు వెళ్లి ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. అనంతరం యడవల్లి సమీపంలో జనాలు లేని ప్రాంతానికి చేరుకున్నాక, తెల్లవారుజామున 2 గంటల సమయంలో వెహికల్ ఆపారు. అంతలోనే లాయర్ హరిప్రసాద్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై ఆయన స్కూటీని పడేసి నిందితులు పరారయ్యారు.
ఎస్పీ డి.కృష్ణారావు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేవలం ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. లాయర్ ను హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న సీఐ సుబ్బానాయుడు, ఎస్సై అనిల్‌కుమార్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.
ట్రెండింగ్ వార్తలు























