Lok Sabha Elections 2024: రాయ్‌బరేలి అమేథి స్థానాలపై కొనసాగుతున్న సస్పెన్స్, కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోందా?
Lok Sabha Election 2024: రాయ్‌బరేలి, అమేథి స్థానాల్లో ఎవరు నిలబడనున్నారన్న సస్పెన్స్‌ని కాంగ్రెస్ ఇంకా కొనసాగిస్తూనే ఉంది.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల రెండు విడతల పోలింగ్ ఇప్పటికే ముగిసిపోయింది. మే 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. అయితే...అన్ని ప్రధాన పార్టీలూ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేయగా..కాంగ్రెస్ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఆ పార్టీకి కంచుకోట అయిన రాయ్‌బరేలితో పాటు అమేథిలో ఇప్పటి వరకూ అభ్యర్థుల పేర్లను ఫైనలైజ్ చేయలేదు. రాయ్‌బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మే 20న ఈ రెండు చోట్లా పోలింగ్ జరగనుంది. నామినేషన్‌లకు మే 3వ తేదీ చివరి గడువు. ఇప్పటికీ కాంగ్రెస్ ఈ స్థానాలపై ఉలుకుపలుకు లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇవాళ (మే 2) పేర్లు ప్రకటించే అవకాశాలున్నాయి. నిజానికి ఈ రెండు స్థానాల్లో ఓ చోట రాహుల్ గాంధీ నిలబడాల్సి ఉంది. మరో చోట ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారని సమాచారం. 2019లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు రాహుల్. అమేథీలోనూ మరోసారి పోటీ చేయాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇక రాయ్‌బరేలీ విషయానికొస్తే...2004 నుంచి కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంది. సోనియా గాంధీ ఇక్కడి నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే..ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ ఎవరిని నిలబెట్టాలని కాంగ్రెస్ మథనపడుతోంది.
ఏం చేద్దాం..?
మళ్లీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తినే నిలబెట్టాలని కొందరు సలహాలు ఇచ్చారు. ఇప్పటికే కుటుంబ రాజకీయాలు అంటూ బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇలాంటి సమయంలో రెండు స్థానాల్లోనూ మళ్లీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తుల్నే నిలబెట్టాలా వద్దా అన్న సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. అభ్యర్థుల పేర్లని ప్రకటించడానికీ కాంగ్రెస్ భపడుతోందన్న విమర్శలకు సీనియర్ నేతలు గట్టిగానే సమాధానం ఇస్తున్నా జాప్యంపై మాత్రం ప్రజల్లో అసహనం నెలకొంది. అమేథి కూడా కాంగ్రెస్‌కి కంచుకోట కావడం వల్ల ఎటూ తేల్చులేకపోతోంది హైకమాండ్. 2004 నుంచి 2019 వరకూ ఇక్కడ కాంగ్రెస్ వరుస విజయాలు అందుకుంది. రాయ్‌బరేలీలో 2004 నుంచి నిన్న మొన్నటి వరకూ సోనియా గాంధీయే వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇందిరా గాంధీ భర్త ఫెరోజ్ గాంధీ 1952 నుంచి 1957 వరకూ ఇక్కడే ఎంపీగా ఉన్నారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా సమాజ్‌వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేస్తోంది. ఈ స్థానాల్లోనూ అభ్యర్థుల పేర్లను ప్రకటించే ముందు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రతిపక్ష కూటమి I.N.D.I.A కి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఆ అభ్యర్థులను ఎంపిక చేసింది కాంగ్రెస్. అయితే..ఇప్పుడు రాయ్‌బరేలి, అమేథి విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆ పార్టీని విమర్శల్లో ముంచెత్తుతోంది.