Congress vs BJP: ఆర్టికల్ 370ని పటేల్, అంబేడ్కర్ కాదనలేదు, అబద్ధాలు చెప్పటంలో ఆయనను మించిపోయారు - జైరాం రమేశ్
Congress Vs BJP: కశ్మీర్ అంశంపై కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Congress Vs BJP on Article 370:
చర్చించాకే నిర్ణయం..
కశ్మీర్‌లో సమస్యలకు నెహ్రూనే కారణమని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. "జవహర్‌లాల్ నెహ్రూ ఏకపక్షంగా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టలేదు. దానిపై ఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించకుండానే పెద్దనోట్ల రద్దు చేసినంత సులువుగా అయితే ఆ పని చేయలేదు. సర్దార్ పటేల్, అంబేడ్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆయన నిర్ణయంపై అభ్యంతరం తెలపలేదు. జమ్ముకశ్మీర్‌లో పని చేసిన
అయ్యంగార్ దాని ముసాయిదా తయారు చేశారు. దాన్ని ఎవరూ తిరస్కరించలేదు. అమిత్‌షా ఆయన "సాహెబ్" (ప్రధాని మోదీ)లాగే అబద్ధాలు వ్యాప్తి చేయటంలో దిట్ట" అని మండిపడ్డారు జైరాం రమేశ్.
Nehru didn’t dictatorially insert Article 370 in Constitution. It was discussed unlike notebandi. Patel, Ambedkar & Syama Prasad Mukherjee didn’t object. Ayyangar who had worked in J&K drafted it. Nobody resigned over it. Amit Shah is as much a superspreader of lies as his Saheb.
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 13, 2022
ఇటీవలే ప్రధాని మోదీ గుజరాత్‌లోని గౌరవ్‌యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. "సర్దార్ సాహెబ్ అన్ని ప్రిన్స్‌లీ స్టేట్స్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ...ఓ పెద్దాయన మాత్రం కశ్మీర్ బాధ్యతల్ని తలకెత్తుకున్నారు" అంటూ నెహ్రూ పేరు ప్రస్తావించకుండా చురకలు అంటించారు. "సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడిచే వాడిని. ఆయన విలువల పట్ల నాకు ఎంతో నమ్మకముంది. అందుకే...కశ్మీర్ సమస్యను పరిష్కరించాను. ఇది సర్దార్ పటేల్‌కు ఇచ్చిన నివాళి" అని అన్నారు.
ఎన్నికల వేడి..
ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార భాజపా మరోసారి విజయం సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ప్రచారం దీటుగానే చేస్తోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ అయితే హామీల వర్షం కురిపించింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఎప్పటి నుంచో మొదలు పెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ తరచుగా గుజరాత్‌లో పర్యటిస్తూ...ఓటర్లకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. హామీలు కూడా భారీగానే ఇచ్చేశారు. ఇటు భాజపా...గౌరవ్ యాత్ర పేరిట ప్రజల్లోకి దూసుకుపోతోంది. గిరిజన నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది భాజపా. అందుకే...ఈ ప్రాంతాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. దశల వారీగా ఈ యాత్రలు చేపట్టనుంది భాజపా. మొదటి రెండు యాత్రలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వం వహించనున్నారు. మిగతా మూడు యాత్రలకు కేంద్రమంత్రి అమిత్‌షా నేతృత్వం వహిస్తారు. కేంద్రమంత్రులతో పాటు సీనియర్ నేతలంతా ఈ యాత్రలో పాల్గొంటారు. భాజపా ఎల్‌ఈడీ ట్రక్‌లు గుజరాత్‌లోని 182 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తుంది. గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఎల్‌ఈడీ తెరల్లో ప్రదర్శిస్తూ ప్రచారం చేస్తారు. ప్రస్తుతం గౌరవ యాత్రలో భాగంగా 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా నేతలు పర్యటిస్తారు. దాదాపు 145 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. మొత్తం 5 గౌరవ యాత్రల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5,700 కిలోమీటర్లు పర్యటిస్తారు. వచ్చే వారం లేదా పది రోజుల్లోనే తొలి దశ యాత్రను పూర్తి చేస్తారు.